Speaker Ayyanna Patrudu Sensational Comments on Visakha Dairy : పాల రైతుల కష్టాన్ని విశాఖ డైరీ యాజమాన్యం అడ్డగోలుగా దోపిడీ చేస్తోందని ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించి చర్యలు తీసుకుంటామని సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో నిర్వహించిన 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు.
జగన్ పాలనలో రాష్ట్రంలోని వ్యవస్థలన్ని నిర్వీర్యం అయ్యాయని మండిపడ్డారు. పాల రైతులకు అన్యాయం చేసిన విశాఖ డైరీ ఛైర్మన్‌ను మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పాల రైతుల నిధులతో విశాఖ సమీపంలోని షీలా నగర్ వద్ద నిర్మించిన ఆసుపత్రిలో పాల రైతుల కుటుంబీకులకు కాకుండా బయటి వారికి వైద్యం కోసం పడకలను కేటాయిస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిపై రైతులు ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. వీటిపై త్వరలోనే విచారణ వేయిస్తామన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వందరోజులు పూర్తయ్యిందని గుర్తుచేశారు. గత ప్రభత్వం ఎటువంటి అభివృద్ధి చేయకపోగా అప్పులను మిగిల్చి వెెళ్లిపోయిందని విమర్శించారు. అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధైర్య పడకుండా ఇచ్చిన హామీలను నేరవేర్చడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని తెలిపారు. అధికారంలోకి రాగానే పింఛన్లను రూ. 3 వేల నుంచి రూ. 4 వేలకు పెంచారన్నారు. అలాగే మెగా డీఎస్సీతో 16437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తొలి సంతకం చేశారన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారని తెలిపారు.
అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు రూ.5 నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. వంద రోజుల్లోనే కూటమి ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేసిందని వివరించారు. అక్టోబర్ మొదటి వారంలో కొత్త మద్యం పాలసీ వస్తుందన్నారు. 99 రూపాయలకే పేదవాడికి నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంచబోతున్నామని తెలిపారు. రానున్న రెండేళ్లలో పోలవరం ఫేస్ వన్ పూర్తి చేస్తామన్నారు. పోలవరాన్ని పూర్తిచేసి జాతికి రైతులకు అందిస్తామన్నారు. అంతకుముందు సభాపతి అయ్యన్నకు లచ్చన్నపాలెం గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీ రామారావు విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.