Smart Phones Effects on Childrens Health : సెల్‌ఫోన్లలో ఆటలు, ల్యాప్‌టాప్‌లో వీడియోలను నిర్విరామంగా చూస్తున్న చిన్నారులకు కళ్లతో పాటు పద సంపద దెబ్బతింటోంది. కళ్లు సహజ రంగులను గుర్తించకపోగా గలగల మాట్లాడే చిన్నారులు మాట్లాడటంలో వెనుకబడుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి చెందిన సురేష్ రెండు సంవత్సరాల వయసులో గలగల మాట్లాడుతూ ఆకట్టుకునేవాడు. తర్వాత ఎవరితోనూ మాట్లాడకపోవడం, పలుకుల్లో వెనుకబాటు, బిగ్గరగా అరవడం మొదలు పెట్టాడు. వైద్యులకు చూపిస్తే స్మార్ట్‌ఫోన్‌కు అలవాటు పడి అది తీవ్ర రూపం దాల్చడమే కారణమని గుర్తించారు.
తణుకులోని ఓ కుటుంబంలో భర్త ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటే కాలక్షేపానికి భార్య ఇంటి దగ్గర చిన్నపాటి వస్త్ర వ్యాపారం ప్రారంభించారు. మూడు సంవత్సరాల బాలుడికి ఫోన్ ఇచ్చి పనిలో నిమగ్నమయ్యేవారు. బాలుడి వయసు పెరుగుతున్న కొద్దీ మాటలు రాకపోవడంతో వైద్యులకు చూపించగా ప్రస్తుతం స్పీచ్‌థెరపీ (Speech Therapy) చేయిస్తున్నారు.
వారిలో పద సంపద తక్కువ : గతంలో అమ్మమ్మలు, నాయనమ్మలు ముచ్చట్లతో మాటలు నేర్పటం మనం చూసేవాళ్లం. ప్రస్తుతం తల్లిదండ్రులిద్దరూ ఏదో ఒక పనిలో లీనమవ్వడంతో పిల్లలకు ఫోన్లు, ట్యాబ్‌లను ఇచ్చేస్తున్నారు. వాటికి అతుక్కుపోతున్న పిల్లల్లో భాషా నైపుణ్యాలు దెబ్బతింటున్నాయి. తెర సమయం తక్కువగా ఉన్న చిన్నారుల కంటే ఫోన్ ఎక్కువగా వాడే వారిలో పద సంపద తక్కువ ఉందని వైద్యులు తెలిపారు.
కారణాలు అనేకం : భాషా నైపుణ్యాల వృద్ధికి డిజిటల్ తెరలే అవరోధం. స్మార్ట్‌ఫోన్ ఇచ్చి వదిలేయడంతో సమస్య ఉత్పన్నం అవువుతోంది. తల్లిదండ్రులు అలసిపోవడం, పనిలో ఉన్నామని, ఫోన్ చూపిస్తే తింటారని, అల్లరి మాని కుదురుగా కూర్చోవాలని ఇలా తదితర కారణాలతో పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారు. దృశ్యాల వీక్షణతో తల్లిదండ్రులకు పిల్లల మధ్య సంభాషణ ఉండటం లేదు.
వైద్యుల పర్యవేక్షణ : భీమవరంలో మూడు సంవత్సరాల బాలుడు మాతృ భాష కాకుండా ఏవో తెలియని పదాలు పలికేవాడు. మొదట్లో సరదాగా అనుకున్నా తర్వాత పదాలు రాకపోవడం, పలకలేకపోవడం గుర్తించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో బాలుడికి తర్ఫీదును ఇస్తున్నారు.
పిల్లలను తెరకు దూరం చేయాలి : తెరకు దూరంగా ఉంచాలి. గత సంవత్సరం విద్యాశాఖ చేపట్టిన లిప్, ఎన్‌సీఈఆర్‌టీ కార్యక్రమాల్లో విద్యార్థులు పలకడానికి ఇబ్బంది పడటం గుర్తించారు. రాష్ట్ర ఆరోగ్య స్వస్థ కార్యక్రమంలోని ఫలితాలు సైతం దీన్ని రుజువు చేస్తున్నాయి. ఈ సమస్య ఇప్పుడిప్పుడే జటిలమవుతోందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనిని తల్లిదండ్రులు గ్రహించి పిల్లలను తెరకు దూరం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఫోన్ ఇవ్వడాన్ని తగ్గించి, వైద్యులను సంప్రదించాలి : పిల్లల్లో కనిపించే సమస్యలు, లోపాలను ఐదేళ్లలోపు గుర్తించాలని భీమవరం ప్రాంతీయ ఆసుపత్రి పిల్లల వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. ఫోన్లకు అలవాటైన పిల్లల్లో భాషా నైపుణ్యాలు పెరగవని, ఐదేళ్లలోపు గుర్తిస్తే సమస్యను త్వరగా నివారించొచ్చని అన్నారు. ఇలాంటి వారు తమకు కావాల్సింది దక్కనప్పుడు కొరకడం, కొట్టడం, తలబాదుకోవడం, వస్తువులు విసిరేయడం వంటివి చేస్తూ వ్యక్తీకరిస్తారని అన్నారు. వెంటనే ఫోన్ ఇవ్వడాన్ని తగ్గించి, వైద్యులను సంప్రదించాలని సూచించారు.