SKY CYCLING AT KAILASAGIRI: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రాజధానిగా విశాఖపట్నంను తీర్చిదిద్దాలనే ప్రభుత్వ ఆలోచనల మేరకు సిటీ అందంగా ముస్తాబవుతోంది. పర్యాటక శాఖ ఉన్నతాధికారులు ఒక్కో అడ్వెంచర్‌ను స్పెషల్ అట్రాక్షన్‌తో అందుబాటులోకి తెస్తున్నారు. కైలాసగిరి వద్ద స్కై సైకిలింగ్ (Sky cycling), జిప్‌లైనర్ (ZIPLINER) సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. సముద్రంలో జల విన్యాసాల కోసం ఎంతో అందమైన, ఆహ్లాదకరంగా ఉండే రుషికొండ బీచ్ పర్యాటకులను కట్టిపడేస్తోంది.
రయ్‌రయ్‌మంటూ దూసుకుపోవచ్చు: చాలా కాలం తర్వాత మళ్లీ పునఃప్రారంభమైన స్కూబా డైవింగ్ (Scuba Diving)కు పలువురు పర్యాటకులు ఆసక్తి చూపుతూ వాటిలో పాల్గొని సరదాగా గడుపుతున్నారు. కొన్ని రోజుల క్రితమే పారామోటార్ (Para Motor)ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని సాయంతో ఆకాశంలో ఓ పక్షిలాగా విహరిస్తూ ఆ పచ్చటి కొండల మీదుగా విశాఖ నగర అందాలను ఎంచక్కా వీక్షించొచ్చు. సముద్ర అలలపై స్పీడ్ బోట్ (Speed Boat)తో రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లొచ్చు.
ఆ ఫీలింగ్ మాటల్లో వర్ణించలేం: విశాఖ నగరానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో సులభంగా చేరుకోవచ్చు. కావాలంటే మంచి అనూభూతి కోసం చెన్నై నుంచి సముద్ర మార్గంలో ప్రయాణించే క్రూయిజ్ షిప్‌లోనూ రావచ్చు. విశాఖకు చేరుకున్న తరువాత మొదటగా ఆర్కే బీచ్ చేరుకొని అక్కడ తెల్లవారుజామున ఉదయించే సూర్యుడిని చూస్తే ఆ ఫీలింగ్‌ని మాటల్లో వర్ణించలేము. అలా అలలను చూస్తూ ఎంతసేపైనా అక్కడే చెట్లకింద కూర్చోవాలి అనుపిస్తూ ఉంటుంది. సముద్రం లోపల నుంచి సూర్యుడు జన్మిస్తున్నాడా అన్నట్లు ఉండే ఆ అందమైన విజువల్స్‌ని జీవితాంతం గుర్తుండేలా మొబైల్లో బంధించకుండా ఉండలేరు. లేలేత కిరణాలు కొత్త అనుభూతిని కలిగిస్తాయి.
ఆర్కే బీచ్ దగ్గరలోనే ఐఎన్‌ఎస్ కుర్‌సుర సబ్‌మెరైన్ మ్యూజియం (INS Kursura Submarine Museum) ఉంటుంది. దానికి ఎదురుగానే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియాన్ని సైతం చూడొచ్చు. ఈ రెండూ భారత నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో విశిష్ట సేవలు అందించాయి. ఈ మ్యూజియాలను వీక్షించడం ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. ఇవి అసలు మన రక్షణ దళాలకు ఏ విధంగా సేవలు అందించాయి, వీటిని ఎలా వాడుతారు వంటి వాటిని అందులో ఉండే గైడ్ ఎంతో చక్కగా వివరిస్తారు.
ఇదే బీచ్ రోడ్డులో ప్రయాణిస్తుంటే ఫిషింగ్ హార్బర్ సైతం చూడొచ్చు. విశాఖకు చేరుకున్న రోజే ఆర్టీసీ బస్టాండ్, జగదాంబ సెంటర్, ఆర్కే బీచ్‌కి దగ్గర్లో ఎక్కడైనా బస ఉండేందుకు హోటల్ తీసుకుంటే అన్ని ప్రదేశాలు తిరగడానికి సౌకర్యంగా ఉంటుంది. ఇలా ఒక్క రోజే దగ్గరలోని పలు ప్రదేశాలను చుట్టి రావొచ్చు.
స్వర్గాన్ని నేరుగా చూస్తున్నామంటున్న యువత - తెల్లవారకముందే అక్కడికి చేరుకుంటేనే!
"కళ్ల ముందే బాహుబలి మంచుకొండలు'' - అరకు కాఫీ తాగుతూ నేరుగా ఆ అందాలను వీక్షించాల్సిందే!