SIT Investigation on Adulterated Ghee Case in Tirumala : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు ప్రారంభించింది. తిరుపతి, తిరుమలలో పర్యటించనున్న ఈ బృందం పూర్తి స్థాయి విచారణ చేపట్టనుంది. సిట్ కోసం తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు. సిట్ అధికారులు 4 బృందాలుగా ఏర్పడి విచారణ చేయనున్నారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌ను సిట్ సభ్యులు పరిశీలించనున్నారు. అలాగే తిరుమలలో లడ్డూ పోటు, విక్రయ కేంద్రాలు, ముడిసరకు పరిశీలించనున్నారు. లడ్డూ తయారీలో పాల్గొనే శ్రీవైష్ణవులను ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం. పూర్తి విచారణ అనంతరం సీబీఐ డైరెక్టర్‌కు సిట్ బృందం నివేదిక ఇవ్వనుంది.
తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎన్‍డీడీబీ పరీక్ష నివేదికలో బయటపడిన అంశంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు ప్రారంభించింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సీబీఐ నుంచి ఇద్దరు అధికారులతో పాటు రాష్ట్రం నుంచి ఇద్దరు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి మరో అధికారి ప్రత్యేక బృందంలో నియమితులయ్యారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజి డీఐజీ గోపీనాథ్ జెట్టీ ఉన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) తరఫున హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు, విశాఖపట్నం ఎస్పీ మురళి రాంబాతో పాటు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (నాణ్యత హామీ) సలహాదారు డాక్టర్ సత్యేన్‌కుమార్ పాండా ఉన్నారు.
దూకుడు పెంచిన సిట్ - నెయ్యి సరఫరా టెండర్లపై ఆరా - SIT Inquiry Adulteration Ghee Case
సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో : సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పని చేయనుంది. వీరంతా తిరుమలకు వచ్చి మొత్తం అక్రమాలను నిగ్గు తేల్చేందుకు చర్యలు చేపట్టారు. మొత్తం 4 డీఎస్పీలు, 8 మంది సీఐలు, 2 ఎస్సైల సేవలను సిట్ వినియోగించుకోనుంది. వీరితో పాటు మరికొంత మంది మినిస్టీరియల్ సిబ్బంది అవసరం ఉందని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరింది. సిట్ విజ్ఞప్తి మేరకు సర్కార్ సిబ్బందిని కేటాయించనుంది.
రంగంలోకి దిగనున్న సిట్ బృందం : సిట్ బృందం సభ్యులకు వసతితో పాటు ప్రత్యేక ఆఫీస్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా సీబీఐ ఆఫీసర్స్ టీటీడీని కోరారు. కంప్యూటర్లతో పాటు ప్రింటర్లు, రికార్డులు భద్రపరిచేందుకు వీలుగా ప్రత్యేక గది, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించుకునేందుకు అనుగుణంగా భవనాలను కేటాయించాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సీబీఐ కోరింది. ఎంక్వైరీ పూర్తయ్యే వరకు కార్యాలయం నుంచే సిట్ తమ విచారణ నిర్వహించనుంది. కార్యాలయం కోసం భవనాలను కేటాయించాలని కోరుతూ టీటీడీకి సీబీఐ లేఖ రాయడంతో అధికారులు కార్యలయం ఏర్పాటు చేశారు. మొత్తంగా సిట్ అధికారులు త్వరలోనే పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సిద్ధమయ్యారు.
తిరుమల లడ్డూ వ్యవహారంపై విచారణకు సిట్ - 9 సభ్యులతో టీమ్ ఏర్పాటు - SIT on Tirumala Laddu Adulteration