Sisodia Report to Government on Madanapalli Fire Incident : మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం కానేకాదని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిసోదియా ప్రభుత్వానికి నివేదించారు. అంతేగాకుండా ఈ ప్రమాదానికి కారకులుగా భావిస్తున్న మాజీ ఆర్డీవోలు మురళి, హరిప్రసాద్‌తోపాటు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్‌నూ సస్పెండ్ చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సిసోదియా నివేదిక : మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో మంటలు ముమ్మాటికీ కుట్రకోణమేనని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిసోదియా ప్రభుత్వానికి నివేదించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడానికి అవకాశామే లేదని ఆయన నివేదిక ఇచ్చారు. మదనపల్లె డివిజన్‌లో జరిగిన భూదందాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రభుత్వం సిసోదియాను అక్కడికి పంపింది. బాధితుల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన ఆయన రెండురోజులపాటు అక్కడ తాను గమనించిన విషయాలను ప్రభుత్వానికి నివేదించారు.
ప్రమాదం కాదు కుట్ర పూరితమే : అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణం కాదన్న సిసోడియా.. బయటి వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఫైళ్లు తగులబెట్టారన్నారు. దెబ్బతిన్న సీసీ కెమెరాలనూ కుట్రకోణంతోనే బాగుచేయించలేదన్నారు. మొత్తం 2,440 ఫైళ్లు కాలిపోయాయని 700 ఫైళ్లను కాపాడారని తెలిపారు. ఇవన్నీ నిషిద్ధ జాబితా నుంచి తప్పించిన భూములకు సంబధించినవేనన్నారు .
14 వేల ఎకరాల చుక్కల భూములను ప్రైవేట్ వ్యక్తుల పేర్లతో క్రమబద్ధీకరించారని ఈ అక్రమాలు బయట పడకుండా ఉండేందుకే దస్త్రాలను తగులబెట్టారన్నారు. ఈ ఘటనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏ, ముఖ్య అనుచరుల ప్రమేయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మాజీ ఆర్డీవో మురళి నిషిద్ధ జాబితా నుంచి భూములను తప్పించడంలో కీలకంగా వ్యవహరించారన్నారు. ఆయన తర్వాత వచ్చిన ఆర్డీవో హరిప్రసాద్ పాత్రపైనా అనుమానం ఉందన్నారు. వీరిద్దరూ భూ వ్యవహారాల్లో అవినీతికి పాల్పడ్డారని సిసోదియా ప్రభుత్వానికి నివేదించారు. రికార్డుల తారుమారులో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ కీలకంగా వ్యవహరించారని తెలిపారు. వీరు ముగ్గురిని సస్పెండ్ చేయాలని సూచించారు. కలెక్టరేట్ నుంచి సబ్ కలెక్టరేట్‌కు వెళ్లిన మెమోలు, ఆదేశాల ఆధారంగా నిషిద్ధ జాబితా నుంచి తొలగించిన భూములను మళ్లీ జాబితాలో చేర్చాలని సిసోదియా సూచించారు.
విశాఖ, ఒంగోలులోనూ ఫిర్యాదుల స్వీకరణ : మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించినట్లే ఒంగోలు, విశాఖలోనూ ఆర్జీలు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. విశాఖలో తక్కువ ధరకు ప్రభుత్వ భూములు పొందిన శారదాపీఠం, ఇతర సంస్థల విషయాల్లో ఏం చేయాలన్నది త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.