Special Story: ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో కొలువు. లక్షల్లో జీతం, విలాసవంతమైన జీవితం. ఇవేమీ అతడికి సంతృప్తి ఇవ్వలేదు. సొంతంగా ఏదైనా సాధించాలనే తపన ఎప్పుడూ అతన్ని వెంటాడేది. ఉద్యోగానికి స్వస్తి చెప్పి సొంతంగా వ్యాపార రంగంలో ప్రవేశించాడు. అన్నిరంగాల్లో ఉపయోగపడుతున్న డ్రోన్లు తయారు చేయాలని భావించి ఒక సంస్థను సైతం స్థాపించి అందులో 10 మందికి ఉపాధిని కల్పిస్తున్నాడు. మరి అతను ఎవరు? తను తయారు చేసిన డ్రోన్ల ప్రత్యేకత తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
కాలం మారుతున్నకొద్దీ సాంకేతికత కొత్తరూపును సంతరించుకుంటోంది. అది సద్వినియోగం చేసుకుంటున్న యువ ఔత్సాహికులు సరికొత్తగా స్టార్టప్స్‌తో అదరగొడుతున్నారు. అదే పనిని ఈ యువకుడూ ఆచరించాడు. డ్రోన్లు తయారుచేసే ఓ అంకుర సంస్థను నెలకొల్పాడు. స్వదేశీ పరిజ్ఞానంతో డ్రోన్లు రూపొందిస్తూ తనతోపాటు కొద్దిమందికి ఉపాధిని అందిస్తున్నాడు.
ముఠా కూలీ నుంచి... పుస్తకాలు రచయితగా.. ఓ చరిత్రకారుడి ప్రస్థానం
నేపథ్యం: ఆ యువ పారిశ్రామిక వేత్త పేరు శ్యామల్ బాబు. విజయవాడ స్వస్థలం. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో విద్యాభ్యాసం పూర్తిచేశాడు. ప్రాంగణ నియామకాల్లో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో ఇంజినీర్ కొలువు సంపాదించాడు. మంచి ఉద్యోగం ఆశించినంత జీతమున్నా ఏదో తెలియని వెలితి అతన్ని వెంటాడేది. సొంతంగా ఏదైనా సాధించాలని చిన్నప్పటి నుంచే కలలు కనేవాడు. ఉద్యోగం చేస్తున్నప్పుడే డ్రోన్ల టెక్నాలజీ క్రమంగా పెరుగుతుండాన్ని గమనించాడు శ్యామల్ బాబు. కంట్రోల్ సిస్టమ్‌పై లోతైన అవగాహన ఉండటంతో వెంటనే ఉద్యోగానికి స్వస్తి చెప్పి డ్రోన్ హబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అంకుర సంస్థను ప్రారంభించి వివిధ రంగాల్లో ఉపయోగపడే డ్రోన్లను తయారు చేస్తున్నాడు.
అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో అద్భుత ప్రదర్శన: డ్రోన్ తయారీ కంపెనీని ప్రారంభించడానికి ముందు స్వీడన్, చైనా, అమెరికా వంటి దేశాలకి వెళ్ళొచ్చాడు శ్యామల్. అక్కడ డ్రోన్ల తయారీ విధానం, ఉపయోగిస్తున్న పరికరాలు, నూతన సాంకేతికత వంటి విషయాలను తెలుసుకున్నాడు. ఫలితంగా కొన్ని నెలలపాటు శ్రమించి టవర్ డ్రోన్, డెలివరీ డ్రోన్, వ్యవసాయ డ్రోన్లను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినట్లు చెబుతున్నాడు. విజయవాడను వరదలు ముంచెత్తినప్పుడు శ్యామల్ డ్రోన్ బృందం విశేష సేవలందించింది. డ్రోన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌తో కలిసి వారం రోజుల పాటు ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు నిత్యవసరాలు సరఫరా చేసింది. అంతేకాదు, అమరావతి డ్రోన్ సమ్మిట్ - 2024లో శ్యామల్ డ్రోన్ బృందం అద్భుత ప్రదర్శన చేసి తృతీయ బహుమతిని కైవసం చేసుకుంది.
డ్రోన్ సేవలపై అవగహన: డ్రోన్ల తయారీతోపాటు అనేక విద్యాలయాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ డ్రోన్ సేవలపై అవగాహన కల్పిస్తున్నాడు శ్యామల్. డ్రోన్ పైలట్ ట్రైనింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి ఆసక్తి ఉన్న వారికి తర్ఫీదు ఇస్తామని అంటున్నాడు. యువత సాంకేతికతను ఉపయోగించుకుంటూ స్ఠార్టప్స్‌పై దృష్టి సారించాలని సూచిస్తున్నాడు. ఇటీవల డ్రోన్ల వినియోగం ఎంత పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటున్నాడు శ్యామల్. భవిష్యత్తులో మరిన్ని రంగాలకు డ్రోన్ల వినియోగం విస్తరిస్తుందని, తగ్గట్టు డ్రోన్ హబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పని చేస్తుందని చెబుతున్నాడు.
''డ్రోన్ తయారీ కంపెనీ ప్రారంభించిన మొదట్లో అర్థిక ఇబ్బందులు ఎదుర్కరొన్నాను. ఆస్తులు తనఖా పెట్టాను. అయినా అధైర్యపడలేదు. తర్వాత షాడో ఫ్లై అనే స్వీడిష్ సంస్థ డ్రోన్ హబ్ టెక్నాలజీస్‌కి సాంకేతిక భాగస్వామ్యం అందించింది. డెలివరీ, వ్యవసాయ విభాగం సహా వివిధ రకాల డ్రోన్లు తయారు చేశాను. వాటి ఎగుమతులకూ ప్రస్తుతం సిద్ధంగా ఉన్నాం'' - శ్యామల్ బాబు, వ్యవస్థాపకులు,డ్రోన్ హబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్
డిజిటల్ యుగంలోనూ పుస్తక పఠనంపై పెరుగుతోన్న ఆసక్తి - Youth interested For Reading Books
కొత్తవాటితో పాటు పాతవి - ఇక్కడ దొరకని పుస్తకమంటూ లేదు - Special Story on Lenin Center