Miniature Craft Artist Lakshminarasimha : చూడ్డానికి నిజమైన విమానాన్నే తలపిస్తున్న ఈ ఎయిర్ క్రాఫ్ట్ నమూనాను చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ. ఇలా ముచ్చటగొలిపేలా ఎన్నో మినీ వాహనాలను తయారు చేస్తూ, సృజనాత్మక ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు ఈ కుర్రాడు. తన కళా ప్రపంచాన్ని యూట్యూబ్ వేదికగా అందరికీ పరిచయం చేస్తూ వావ్ అనిపిస్తున్నాడు. సిద్దిపేటకు చెందిన ఈ యువకళాకారుడి పేరు లక్ష్మీనరసింహ. హైదరాబాద్‌లోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో మెకానికల్ విభాగంలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
తల్లిదండ్రులు వెంకటలక్ష్మి, భాస్కర్‌లు. తండ్రి గతంలో టీవి మెకానిక్‌గా పనిచేసేవాడు. తల్లి వెంకటలక్ష్మి వృథా వస్తువులతో వివిధ అలంకరణ వస్తువులను తయారుచేసేది. వారి ప్రేరణతో ఖాళీ సమయాల్లో కళాకృతులు, చిన్న చిన్న వాహనాలను రూపొందించటం అలవాటు చేసుకున్నాడు లక్ష్మీనరసింహ. తొలినాళ్లలో పేపర్లు, అట్టముక్కలతో బొమ్మలు చేసినా క్రమంగా మినీ క్రాఫ్ట్ వైపు ఆకర్షితుడయ్యాడు లక్ష్మీనరసింహ.
చిన్నప్పుడు చూసిన కార్టూన్లు, తల్లి రూపొందించే వస్తువుల స్ఫూర్తితో మినియేచర్ క్రాఫ్ట్ నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిందని అంటున్నాడు. 9వ తరగతిలో స్మార్ట్ సిటీ ఆకృతిని విజ్ఞాన మేళాలో ప్రదర్శించి తొలి బహుమతి సాధించాక మరింత ఉత్సాహం వచ్చిందని చెబుతున్నాడు. ఏ నమూనాలనైనా, ఉన్నది ఉన్నట్టుగా రూపొందించడమే కాదు. బ్యాటరీల సాయంతో నిజమైన వాహనాల్లాగే పరుగులు పెట్టిస్తాడు ఈ కుర్రాడు.
డెప్రాన్ షీట్లు, బ్యాటరీలు, అవసరం బట్టి వివిధ రకాల వస్తువులు ఎంచుకుని ఆకృతులు తయారుచేస్తున్నాడు లక్ష్మీనరసింహ. తాజాగా ఓ ఎయిర్ క్రాఫ్ట్ మోడల్‌కు రూపకల్పన చేశాడు. దీనికి భారత ఆర్మీ వినియోగించే ఆర్మీ కార్గో ప్లేన్-C130 హెర్య్యూలెస్‌గా నామకరణం చేశాడు. ఈ ఆర్సీ మినీయేచర్ విమానం 8కిలోల వరకూ బరువు మోసుకెళ్లగలదని చెబుతున్నాడు. ప్రస్తుతం ట్రయల్ దశలో ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
కొవిడ్ సమయంలో క్రియేటివ్ ఫాక్స్ పేరిట యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించాడు లక్ష్మీ నరసింహ. మినీయేచర్ ఆర్ఎసీ మోడల్స్ ఎలా చేయాలో వీడియోల ద్వారా నేర్పిస్తున్నాడు. యూట్యూబర్‌గా వీలైనంత ఎక్కువమందికి చేరువ కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడు. చిన్నప్పటి ఏది చేస్తామన్నా కాదనలేదని, నచ్చింది చేసేలా కుమారుడిని ప్రోత్సహించడం వల్లే నలుగురితో ప్రశంసలు పొందుతున్నాడని అంటున్నారు లక్ష్మీనరసింహ తల్లిదండ్రులు. తల్లిదండ్రుల తోడ్పాటు లేకపోతే ఇలాంటి సృజనాత్మక ఆవిష్కరణలు చేయగలిగేవాన్ని కానని అంటున్నాడు లక్ష్మీనరసింహ. ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేయాలనేది తన చిరకాల కోరికని వెల్లడిస్తున్నాడు.
"నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలు చేయడం చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు టీవీలో చూసిన కార్టూన్లలో బొమ్మలను రూపొందించాలని బాగా తపన ఉండేది. బొమ్మల నుంచి మినియేచర్ ఆకృతులను తయారుచేస్తున్నాను. ఇవాళ నేను విమానం బొమ్మ తయారు చేశాను. దాన్ని ఎగురవేయాలన్నది నాలక్ష్యం". - లక్ష్మీనరసింహ, మినియేచర్ ఆర్టిస్ట్
కళ్లు లేకున్నా కలలు సాకారం- చదువులో రాణిస్తున్న లక్కీ మిరానీ సక్సెస్ స్టోరీ - Lucky Mirani story