Shortage of Cotton Seeds to Farmers : తొలకరి మొదలవటానికి ముందే రైతులు తాము వేయాలనుకున్న పంటకు సంబంధించి విత్తనాలను సిద్ధం చేసుకుంటారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పత్తి సాగు కోసం సిద్ధమైన రైతులు విత్తనాలు సరిగా లభించక ఇబ్బందులు పడుతున్నారు. చాలా రకాల కంపెనీల విత్తనాలు మార్కెట్లో ఉన్నా రైతులు కొన్నింటి వైపే మొగ్గు చూపిస్తున్నారు. పుచ్చు రాకపోవటం, గులాబీ రంగు పురుగుని తట్టుకునే రకాలు కావాలని అడుగుతున్నారు.
గత సీజన్లో తెగుళ్లు తట్టుకుని మంచి దిగుబడులు సాధించిన రకాల కోసం రైతులు పట్టుబడుతున్నారు. దీంతో కంపెనీలు, వ్యాపారులు కుమ్మక్కై అధిక ధరలకు విత్తనాలు విక్రయిస్తున్నారు. బీటీ రకం పత్తి విత్తనాల్లో రెండు కంపెనీల విత్తనాలకు ఇప్పుడు డిమాండ్ ఉంది. వాటిని వ్యాపారులు గరిష్ఠ చిల్లర ధర కంటే అధికంగా విక్రయిస్తున్నారు. ఒక కంపెనీ విత్తనం సంచి ఎమ్మార్పీ రూ.864 ఉండగా రూ.1100 నుంచి రూ.1200 వరకు రైతులకు అమ్ముతున్నారు.
కొరవడిన అధికారుల పర్యవేక్షణ.. నిండా మునిగిన రైతులు
ఈ విత్తనం కావాలంటే ఇతర రకాలు కూడా తీసుకోవాలని సదరు కంపెనీ లింకు పెట్టడంతో వ్యాపారులు వాటిని కూడా కొనుగోలు చేసి ఈ రకం విత్తనాన్ని అధిక ధరకు అమ్ముకుని సర్దుబాటు చేసుకుంటున్నారు. పత్తి సాగు తొలుత తెలంగాణలో ప్రారంభమవుతుంది. నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతులు సాగుచేసే విత్తనాలు లభ్యత లేకపోవడంతో గుంటూరు వచ్చి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. అక్కడి విత్తనాలకు డిమాండ్ ఉందని గుర్తించిన కంపెనీలు మార్కెట్‌లోకి తక్కువగా సరకు విడుదల చేసి కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. దీనిని అందిపుచ్చుకున్న వ్యాపారులు ఎమ్మార్పీకి మించి విక్రయాలు చేస్తున్నారు.
డిమాండ్ ఉన్న విత్తనాలను ఆయా కంపెనీలు అవసరమైనంత విడుదల చేయకుండా కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఇక్కడ సీజన్ ప్రారంభమైతే విత్తన కొరత మరింతగా పెరిగే అవకాశముంది. అప్పుడు విత్తన ధరలు మరితంగా పెరిగే అవకాశముంది. ఇది విత్తన కొరతకు దారితీసే ప్రమాదం ఉంది. అధిక ధరకు మించి విక్రయాలు చేస్తుండటంతో స్థానికంగా విత్తనాల కొరత ఏర్పడుతుందని గుంటూరు జిల్లా వ్యవసాయాధికారులు గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కంపెనీ నుంచి వ్యాపారుల వద్దకు వచ్చిన సరుకుని బట్టి ఆ విత్తనాలను రైతులకు పంపిణి చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాస్ బుక్ తెచ్చిన రైతుకు పొలం విస్తీర్ణాన్ని బట్టి 2నుంచి 5 ప్యాకెట్లు కేటాయిస్తున్నారు.
రైతులకు అన్ని విషయాల్లో అండగా ఉంటున్నామని ప్రచారం చేసుకునే వైఎస్సార్సీపీ సర్కారు రైతుకు అవసరమయ్యే విత్తనాలను కూడా సరిగా పంపిణీ చేయలేకపోతోంది. గతేడాది కరవుతో తీవ్రంగా నష్టపోయి పెట్టుబడుల్ని కోల్పోయిన రైతుకు ఉచిత విత్తన రూపంలో చేయూత ఇవ్వాలనే విషయాన్ని కూడా విస్మరించింది. ఇప్పటికే కొన్ని రకాల పత్తి విత్తనాల ధరలు చుక్కలనంటుతున్నాయి. సరఫరా తక్కువగా ఉండటంతో వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. కనీసం రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేయించాలనే ఆలోచన కూడా సర్కారులో కొరవడింది. రైతులను వ్యాపారుల ఇష్టానికి వదిలేసి చోద్యం చూస్తోంది. ఎకరానికి కనీసం రెండు ప్యాకెట్ల విత్తనాలు అవసరం.
ఈ ప్రకారం రైతులు ఎకరాకు రూ.600 నుంచి రూ.700 వరకు అదనంగా విత్తనాల కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. అధికారులు సార్వత్రిక ఎన్నికల విధుల్లో ఉండటంతో విత్తన విక్రయాలపై పూర్తి స్థాయిలో దృష్టిసారించడం లేదు. ఇదే అదునుగా వ్యాపారులు వీలైనంత త్వరగా అమ్మేసి చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశంతో అధికధర విక్రయాలకు తెరలేపారు. పల్నాడు జిల్లాలో పత్తి విత్తన విక్రయాలు ఊపందుకున్నాయి. గుంటూరులోనూ ఇప్పుడిప్పుడే పత్తి విత్తనాల కొనుగోలుకు రైతులు మార్కెట్‌కు వస్తున్నారు. అయితే తమకు కావాల్సిన రకాలు సరిగా దొరకటం లేదని అంటున్నారు. అధిక ధరలకు అమ్ముతున్నారని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ అధికారులు జోక్యం చేసుకుని ఒకటి అరా ప్యాకెట్లు ఇప్పిస్తున్నా అవి సరిపోవటం లేదని చెబుతున్నారు.
Kurnool Mega Seed Hub: కర్నూలు విత్తన భాండాగారాన్ని పట్టాలెక్కించండి జగన్ సారూ..!