Four Died as Wall Collapses Due to Strong Winds : తెలంగాణలో ఈదురు గాలులకు నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కూలి పదేళ్ల చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. ఈ ఘటన తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా తాడూరులో జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా, ఒకరు సురక్షితంగా బయటపడ్డారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు శివారులో సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో వ్యవసాయ పొలంలో నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కిందకు అక్కడే పని చేస్తున్న తొమ్మిది మంది వెళ్లారు. గాలి బలంగా వీయడంతో షెడ్డుపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. ఒక్కసారిగా నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోయింది. దీంతో గోడ పక్కనే ఉన్న యజమాని మల్లేశ్, అతని పదేళ్ల కుమార్తె సహా అక్కడ పని చేసే మరో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలు కాగా, ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మేడ్చల్‌లో చెట్టుకూలి ఇద్దరు మృతి : మరోవైపు మేడ్చల్ జిల్లా కీసర మండలంలో గాలి దుమారంతో కూడిన వర్షాల కారణంగా రోడ్డు పక్కన ఉన్న చెట్లు విరిగిపోయాయి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తిమ్మాయిపల్లి గ్రామ సమీపంలోని కీసర నుంచి షామీర్ పేట వైపు వెళ్లే రోడ్డు పక్కన ఇద్దరు ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. వారిపై చెట్టు పడింది. దీంతో వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే ఆ వ్యక్తిని ఇసీఐఎల్‌లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. వారిద్దరూ యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలానికి చెందిన నాగిరెడ్డి రామ్‌రెడ్డి, ధనుంజయగా గుర్తించారు.
తెగిన విద్యుత్ తీగలు - తప్పిన ప్రాణ నష్టం : అలాగే మరోవైపు కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంతో పాటు మండలంలోని బోర్లం, తాడ్కోల్, బుడిమి, కొత్తబాది తదితర గ్రామాలలో వీచిన ఈదురు గాలులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా వీచిన ఈదురు గాలులతో గ్రామాలలోని పలు నివాసపు గుడిసెలు, ఇళ్ల పైకప్పులు, రేకుల షెడ్లు పైకి లేచిపోయాయి. భారీ వృక్షాలు నేల మట్టం అయ్యాయి. బోర్లం గ్రామంలో విద్యుత్ స్తంభాలు విరిగి నేలపై పడ్డాయి. విద్యుత్ అధికారులు సరఫరా నిలిపివేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
కుండపోత వర్షాలతో ఉప్పొంగిన వాగులు- కాకినాడ జలమయం - Rains in Andhra Pradesh