Sexual Assault in Tollywood: కేరళలో జస్టిస్ హేమ కమిటీ నివేదిక వెలుగులోకి రావడంతో మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతోంది. ఈ నేపథ్యంలో రెండేళ్లుగా బయటకు రాని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన రిపోర్టునూ బయటపెట్టాలంటూ డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. 2018 అక్టోబరులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అప్పటి ప్రభుత్వం 2019 ఏప్రిల్‌లో 25 మందితో కమిటీ వేసింది. ఇందులో 12 మంది మహిళలతో కూడిని ఉపకమిటీని ఏర్పాటు చేసింది.
ఈ హైలెవల్ కమిటీ విస్తృత అధ్యయనం, పరిశీలన, సంప్రదింపుల తరువాత ‘‘తెలుగు సినీ, టెలివిజన్ పరిశ్రమల్లోనూ మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, అభద్రతాభావం, లింగవివక్ష కనిపిస్తోందని స్పష్టం చేసింది. నటీమణులు, గీత రచయితలు, జూనియర్ ఆర్టిస్టులు ఇలా అన్ని స్థాయుల్లోనూ పురుషాధిక్యత కనిపిస్తోందని, అసభ్య, అవమానకరమైన భాషను వాడుతున్నారని పేర్కొంది. సురక్షితమైన రవాణా వసతి లేకుండా రాత్రివేళల్లో ఆలస్యమయ్యే వరకూ పనులు చేయిస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ 2022 జూన్ 1వ తేదీన ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే ఆ రిపోర్టు ఇప్పటి వరకూ వెలుగులోకి కాలేదు. దీంతో ఆ కమిటీ చేసిన సిఫార్సులు అమలుకు నోచుకోలేదు.
'ఆ డైరెక్టర్ నన్ను శృంగార బానిసగా చూశాడు' : నటి సంచలన ఆరోపణలు - Hema Committee Report
రిపోర్టులో ఏం చెప్పారంటే?
- ఫిల్మ్ ఇండస్ట్రీలో పలువురు మహిళలు తాము ఎదుర్కొంటున్న వేధింపులపై ఫిర్యాదు చేశారు. రికార్డింగ్ స్టూడియోలతోపాటు ఫిల్మ్ సెట్లలో, ఆడిషన్ ఛాంబర్లలో అవమానాలు పడుతున్నట్లు తెలిపారు. జూనియర్, డైలాగ్ ఆర్టిస్టుల్లో చాలామంది తమ రోజువారీ కూలి కోసం కార్యాలయాల చుట్టూ అనేక రోజులు తిరగాల్సి వస్తోందన్నారు. కొంతమంది కోఆర్డినేటర్లు, మధ్యవర్తులపై ఆధారపడుతున్నట్లు చెప్పారు. తమ సంఘంలో నమోదు కాని వారే కోఆర్డినేటర్లపై ఆధారపడుతూ లైంగిక దోపిడీకి గురవుతున్నారని తెలుగు సినీ కళాకారుల సంఘం ప్రతినిధులు వెల్లడించినట్లు కమిటీ పేర్కొంది.
- సినిమాలు, టీవీలు, యూట్యూబ్ ఛానళ్ల పేరుతో మహిళలను పిలిచి క్లోస్డ్ రూమ్స్‌లో ఆడిషన్లు నిర్వహిస్తున్నారు. అక్కడ ఇతర మహిళలెవరూ ఉండటం లేదు. ఆడిషన్లను రికార్డ్ సైతం చేయడం లేదు. రవాణా సౌకర్యం కల్పించకపోవడమూ వేధింపులకు కారణమవుతోంది. డాన్స్ స్కూళ్లలోనూ మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారు. ఆడిషన్ల నుంచే వేధింపులకు బీజం పడుతోందని, దీనికి మేనేజర్లు, ఏజెంట్లే బాధ్యులని ఒక మహిళా జర్నలిస్టు వివరించినట్లు అని తెలిపింది.
- లైంగిక వేధింపుల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే అవకాశాలు రానివ్వకుండా చేసి ఇండస్ట్రీ నుంచి బయటికి పంపుతున్నారు. దీంతో చాలామంది మహిళలు భయపడి నిజాలు చెప్పడం లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన అసోసియేషన్‌లలో తక్కువ మంది మహిళలకు మెంబర్‌షిప్‌లు కల్పిస్తున్నారు. వీటిల్లో మెంబర్‌షిప్ ఫీజు భారీగా ఉంటోంది. కొన్నింట్లో 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు ఉంది. ఇంత భారీ మొత్తాన్ని మహిళలు చెల్లించలేకపోతున్నారు. సినిమాటోగ్రఫీ అసోసియేషన్‌లో మొత్తం 400 మంది సభ్యుల్లో ఇద్దరు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్‌లో మొత్తం 580 మందిలో ఒక్కరు, కాస్ట్యూమర్స్ యూనియన్‌లో మొత్తం 500 మందిలో 20 మంది, తెలుగు ఫిల్డ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో మొత్తం 1200 మందిలో 25 మంది, రచయితల సంఘంలో 1500 మందిలో 75 మంది మాత్రమే మహిళలు ఉన్నారని వెల్లడించింది.
- ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్దిష్ట పని గంటలు లేవు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 వరకు పనిచేయాల్సి వస్తోందని మహిళలు తెలిపారు. టీవీ పరిశ్రమలో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 వరకు పనిచేస్తున్నారు. పని ప్రదేశాల్లో మహిళలకు సరైన వసతి సౌకర్యాలు లేవు. బాత్‌రూమ్‌లు, ఆహారానికి, రవాణాకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రెస్‌లు మార్చుకోవడానికి రూమ్‌లు ఉండటం లేదు. వారికి వేతనాలు కూడా సరిగా ఇవ్వడం లేదు. ఏజెంట్లు వారి నుంచి కమీషన్లు వసూలు చేస్తున్నారని కమిటీ తెలిపింది.
మాలీవుడ్‌ను నాశనం చేయొద్దు- వారికి శిక్ష తప్పదు: మోహన్ లాల్ - Mohanlal
కమిటీ చేసిన సిఫార్సులు
- సినీ, టీవీ పరిశ్రమల్లో మహిళలకు భద్రత, రక్షణ కల్పించాలని, దీనికి ప్రభుత్వం, సినిమాట్రోగఫీ, స్త్రీశిశు సంక్షేమం, కార్మిక, పోలీసు శాఖలు ప్రత్యేక చొరవ తీసుకోవాలి.
- మహిళల ఫిర్యాదుల పరిష్కారం కోసం పోలీసు డిపార్ట్మెంట్ షీటీమ్‌ల ఆధ్వర్యంలో ఒక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలి.
- వేధింపుల ఫిర్యాదులపై విచారణకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇంటర్నల్ కమిటీని ఏర్పాటు చేయాలి. పరిశ్రమలోని ప్రతి యూనియన్‌లోనూ ఇలాంటి ఒక కమిటీ ఉండాలి.
- యూనియన్లలో మహిళలను ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వాలి.
- ఇండస్ట్రీలో కోఆర్డినేటర్ల వ్యవస్థను క్రమబద్ధీకరించాలి.
- ఆడిషన్లను అందరి ముందూ నిర్వహించాలి.
- షూటింగ్ స్పాట్లో టాయ్‌లెట్లు, దుస్తులు మార్చుకునే గదులు, రవాణా వసతి కల్పించాలి.
- కార్మిక, మహిళా చట్టాలను అమలు చేయాలంటూ కమిటీ పలు సిఫార్సులు చేసింది.