Severe Water Crisis in Kurnool: కర్నూలు పశ్చిమ ప్రాంతంలో నీటి సమస్య తరతరాలుగా కొనసాగుతోంది. పక్కనే తుంగభద్ర నది ఉన్నా ప్రజలకు గుక్కెడు మంచినీరు దొరకటం లేదు. వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు గడిచినా ఇప్పటికీ గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. శుక్రవారం ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. మంత్రులు ఎన్ఎండీ ఫరూఖ్, బీసీ జనార్ధన్ రెడ్డి, టీజీ భరత్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.
తాగునీటి సమస్య పెద్దగా లేదని అధికారులు చెప్పటంతో ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలో ఇప్పటికీ వారం రోజులకు ఒకసారే తాగునీరు వస్తోందని ఎంపీ బైరెడ్డి శబరి ధ్వజమెత్తారు. ఇంటింటికీ కుళాయిలు 20 శాతం కూడా పూర్తికాలేదన్నారు. తుంగభద్రనదీ తీర ప్రాంత గ్రామాల్లో నేటికీ తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
నిలిచిన కుళాయి నీటి సరఫరా- పొలాలు, కుంటల్లోని వర్షపు నీరే దిక్కు - Drinking Water Scarcity Anantapur
నీటి పథకాలను ఎందుకు పూర్తి చేయలేదు: ఆస్పిరి, హొళగుంద మండలాల్లో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని... ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గుర్తు చేశారు. ఆదోని మండలంలో వారానికి ఒకసారి మాత్రమే నీరు వస్తోందని, బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణంలో అవినీతి కారణంగా పూర్తిస్థాయిలో నీరు నిల్వచేయలేని దుస్థితి నెలకొందని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గుర్తు చేశారు. కోడుమూరు నియోజకవర్గంలోనూ తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉందని, రక్షిత మంచి నీటి పథకాలను ఎందుకు పూర్తి చేయలేదని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి నిలదీశారు.
ఎన్ని ఉన్నాయో మీ వద్ద లెక్కలు ఉన్నాయా: గాజులదిన్నె ప్రాజెక్టు ఉన్నా తాగు నీటిని సరఫరా చేయలేని దుస్థితి ఎందుకు నెలకొందో చెప్పాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బి.వి జయనాగేశ్వరరెడ్డి నిలదీశారు. నందికొట్కూరు నియోజకవర్గంలోనూ రక్షిత మంచినీటి పథకాలు ముందుకు సాగలేదని, ఫలితంగా కొత్తపల్లి, నందికొట్కూరు మండలాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని ఎమ్మెల్యే జయసూర్య ధ్వజమెత్తారు. మరోవైపు ఆర్ఓ ప్లాంట్లు ఎన్ని ఉన్నాయో మీ వద్ద లెక్కలు ఉన్నాయా అంటూ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు.
ఇంటింటికీ కుళాయిల విషయంలో భారీ అవినీతి: పాణ్యం, ఓర్వకల్లు మండలాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత గుర్తు చేశారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ఇంటింటికీ కుళాయిల విషయంలో భారీ అవినీతి జరిగిందని, దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయటం ద్వారానే తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్న ప్రజాప్రతినిధులు అందుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.