Several People Dead in Road Accident at East Godavari District : ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే ప్రధాన రహదారి రక్తసిక్తమైంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మినీలారీ రూపంలో మృత్యువు ఏడుగురు కార్మికులను బలితీసుకుంది. ఈ దుర్ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు మినీలారీ బయలుదేరింది. ఆరిపాటిదిబ్బలు-చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో అదుపుతప్పి పంటబోదెలోకి మినీలారీ దూసుకెళ్లి తిరగబడింది. ఆ సమయంలో వాహనంలో డ్రైవర్‌తో పాటు 9 మంది కార్మికులు ఉన్నారు. సంఘటన అనంతరం డ్రైవర్ తప్పించుకుని పరారయ్యాడు.
నంద్యాల జిల్లాలో పండుగపూట విషాదం - రోడ్డు ప్రమాదంలో తల్లీ, కుమారుడి మృతి
జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని : మినీలారీ తిరగబడిన సమయంలో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని ఏడుగురు కార్మికులు చనిపోయారు. స్థానికులు సకాలంలో స్పందించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ దేవకుమార్, ఎస్సైలు శ్రీహరిరావు, సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకున్న వారిని వెలికితీశారు. సంఘటనలో గాయపడిన వారిలో ఒకరిని ఘంటా మధుగా పోలీసులు గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.
మృతులు వీరే : సమిశ్రగూడెం మండలం తాడిమళ్లకు చెందిన దేవాబత్తుల బూరయ్య (40), తమ్మిరెడ్డి సత్యనారాయణ (45), పి.చినముసలయ్య (35), కత్తవ కృష్ణ (40), కత్తవ సత్తిపండు (40), తాడి కృష్ణ (45), నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన బొక్కా ప్రసాద్‌గా పోలీసులు వెల్లడించారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సమాచారంతో బాధితుల కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. 'అమ్మా.. నాన్న కావాలి, అయ్యో నేను బ్రతికేది ఎలా..' అంటూ మృతుల భార్యాపిల్లల రోదనలు స్థానికుల సైతం కంటతడి పెట్టించాయి. ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులు మృతి చెందడంతో తాడిమళ్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మిలిలారీ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలియజేశారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని వెల్లడించారు.
బాధిత కుటుంబాలకు సీఎం భరోసా : ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీడి పిక్కల లోడ్‍తో వెళ్తున్న లారీ బోల్తా కొట్టిన ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం తమల్ని కలిచివేసిందని పేర్కొన్నారు. గాయపడిన వారికి అందుతున్న వైద్యంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు.
బాపట్లలో ట్రాక్టర్ బోల్తా - ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు - TRACTOR BOLTHA in bapatla