Server Problems In Registration Offices In AP : వీల్ చైర్‌లో కూర్చుని అనారోగ్యంతో బాధపడుతోన్న ఓ పెద్దాయన తమ స్థిరాస్తిని రిజిస్ట్రేషన్ చేసేందుకు ఎంతో దూరం నుంచి వ్యయప్రయాసల కోర్చి పటమట రిజిస్టరేషన్ కార్యాలయానికి వచ్చారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్ పనిచేయకపోవడంతో అష్టకష్టాలు పడ్డారు. రోజంతా వేచి చూసినా రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వృద్ధులు, వికలాంగులు, మహిళలది ఇదే పరిస్థితి. గురువారం బుద్ధపూర్ణిమ మంచి రోజని భావించి రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వందలాది మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Server Issue In Registration Offices : కనీసం కూర్చునేందుకు కుర్చీలు లేవు. నిలబడేందుకు నీడలేదు. తాగేందుకూ గుక్కెడు నీరు లేదు. వీటన్నిటికి తోడు పార్కింగ్ అతిపెద్ద సమస్య. ఇలా కిక్కిరిసిన కార్యాలయంలో రోజంతా పడిగాపులు కాచినా వచ్చిన పని కాకపోవడంతో ఉసూరుమంటూ వెనుతిరిగారు. ఇదంతా ఒక్కరోజు సమస్యే కదా అనుకుంటే పొరపాటే. తరచూ విజయవాడ సహా రాష్ట్ర వ్యాప్తంగా చాలా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వేలాది మంది క్రయవిక్రయదారులు సర్వర్ సమస్యలతో పడుతున్న కష్టాలు ఇవి.
ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ కోసం బారులు తీరిన లబ్ధిదారులు - సర్వర్ డౌన్‌తో ఇబ్బందులు
'క్రయవిక్రయదారుల కష్టాలు తీరుస్తామని చెప్పిన వైఎస్సార్సీపీ సర్కార్ కోట్లు వెచ్చించి కార్డ్ ప్రైమ్ 2.0 పేరిట కొత్త సాఫ్ట్ వేర్‌ను కొనుగోలు చేసింది. అధునాతన సర్వర్లను అమర్చినట్లు చెప్పుకొచ్చింది. ఇకపై క్రయవిక్రయదారులు వేచి చూడాల్సిన అవసరం ఉండదని నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్లు చేస్తామని ఆ శాఖ ఉన్నతాధికారులు సైతం ఊదరగొట్టారు. తీరా చూస్తే అమల్లోకి వచ్చిన కొత్త సాఫ్ట్వేర్ లోనూ సాంకేతిక సమస్యలు పరిష్కారం కాలేదు. తరచూ సర్వర్‌లో సమస్యలు వస్తూనే ఉన్నాయి, సేవలు నిలిచిపోతూనే ఉన్నాయి. ఫలితంగా రోజంతా నరకయాతన అనుభవించాల్సి వస్తోంది.' -క్రయవిక్రయదారులు
ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చే శాఖల్లో ప్రథమ స్థానం రిజిస్ట్రేషన్ల శాఖదే. రిజిస్ట్రేషన్లు, స్టాంప్ డ్యూటీల పేరిట ప్రభుత్వానికి రోజూ కోట్లలో ఆదాయం సమకూరుతుంది. అంతటి కీలక శాఖపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం ఇక్కడా రివర్స్ గేర్ విధానమే అనుసరిస్తోంది. జనాభాకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, సిబ్బందిని ప్రభుత్వం పెంచలేదు. ప్రస్తుతం ఉన్న అరకొర సిబ్బందితోనే బండి నెట్టుకొస్తోంది. ప్రభుత్వం తక్షణమే రిజిస్ర్టేషన్ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి సర్వర్ సమస్యల్ని పరిష్కరించాలని క్రయవిక్రయదారులు డిమాండ్ చేస్తున్నారు.