Journalists Seminar on Election Reporting: సార్వత్రిక ఎన్నికల్లో జర్నలిస్టులు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా తమ బాధ్యతలను నెరవేర్చాలని ఐజేయూ అధ్యక్షుడు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కోరారు. విజయవాడలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికలు - మీడియా పాత్రపై నిర్వహించిన సదస్సులో సిటిజన్ ఫర్ డెమాక్రసీ కార్యదర్శి లక్ష్మణ రెడ్డి, ప్రొఫెసర్ ఎంసీ దాస్ తో కలిసి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు మెుత్తం 10 వేల 702 కోట్లు ఖర్చు చేశారని శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వాస్తవానికి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ అభ్యర్థి 40 లక్షలకు మించి ఖర్చు పెట్టకుడదనే నిబంధనలు ఉన్నాయన్నారు. కానీ ప్రచారంలో ఒక్కరోజే 40 లక్షలు ఖర్చు చేసే అభ్యర్థులు చాలామంది ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి కనీసం నలభై కోట్లు ఖర్చు చేసే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాల మాదిరిగానే ఎన్నికల సంఘం కళ్లకు నల్లగుడ్డ కట్టుకునే పరిస్థితులు వచ్చాయన్నారు. ఎన్నికల సంఘం చెవితో కూడా వినడానికి సిద్ధంగా లేదని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. సాధారణ ఎన్నికలతోపాటు గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎన్నికల్లోనూ ఓటు వేసేందుకు ఓటర్లు డబ్బులు తీసుకునే పరిస్థితి ప్రజాసామ్యానికి మంచిది కాదని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సామాన్యులు, మేధావులు భయపడుతున్నారని చెప్పడానికి సిగ్గు వేస్తోందన్నారు.
ఐదేళ్లలో రాష్ట్రంలో శాసన, కార్యనిర్వహక వ్యవస్థలు నీరుగారిపోయాయని సిటిజన్ ఫర్ డెమాక్రసీ కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో డబ్బు పాత్ర బలంగా ఉందని, సామాన్యులు నిలబడలేని పరిస్థితి ఉందన్నారు. పార్టీలు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చే డబ్బు లెక్క వేసుకుంటే రోజుకు ఇచ్చేది 54 పైసలేనని, ఇందుకోసం ప్రజలు ఓటుహక్కును దుర్వినియోగం చేయవద్దని లక్ష్మణరెడ్డి కోరారు. ప్రభుత్వం సమర్థవంతంగా పని చేయడం లేదని ప్రశ్నిస్తే కేసులు పెట్టే పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పిటిషన్పై హైకోర్టులో విచారణ - తగిన చర్యలపై ఈసీకి ఆదేశాలు
సోషల్ మీడియా లేకపోతే, సంప్రదాయ మీడియా వాస్తవాలను బయటికు తీసే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదు సంవత్సరాలుగా శాసన, కార్యనిర్వాహక వ్యవస్థను అధికార పార్టీ గుప్పిట్లో పెట్టుకొని నడిపిస్తుందని లక్ష్మణరెడ్డి తెలిపారు. అధికార పార్టీకి చెందిన పీఏకు సైతం కలెక్టర్లు బయపడే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. పరిమితికి మించి ఖర్చులు పెడుతున్న ఒక్క ఎమ్మెల్యేపై వేటు వేసిన దాఖలాలు లేవని తెలిపారు. ఎన్నికల సంఘం సమర్థవంతంగా పని చేస్తే, అభ్యర్థులు ఖర్చులు చేసే విషయంలో జాగ్రత్తలు పాటిస్తారని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో సైతం 90 లక్షలు ఖర్చుపెట్టాలనే నిబంధనలు ఉంటే, సుమారు 100 కోట్లు ఖర్చు పెట్టేందుకు వెనకాడటం లేదని తెలిపారు. 100 కోట్లో ఖర్చు పెట్టిన వ్యక్తి అంతకు మించి సంపాధించాలని అనుకుంటాడని వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు.