Section 144 in Palnadu : పల్నాడు జిల్లాలో పోలింగ్ తర్వాత జరుగుతున్న వరుస హింసాత్మక ఘటనలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాల్లో భారీగా పోలీసులు మోహరించారు. జిల్లా వ్యాప్తంగా 18వందల మంది పోలీసులను భద్రత కోసం నియమించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారంపూడిలో విధ్వంసానికి పాల్పడ్డారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాచవరం మండలం కొత్తగణేశునిపాడు వెళ్లి తన అనుచురులతో బీభత్సం సృష్టించారు. గొడవలు జరిగిన ప్రాంతాల్లో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. మాచర్ల నియోజకవర్గంపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
మాచర్ల, కారంపూడి పట్టణాల్లో 12వందల మంది పోలీసులను నియమించారు. పిన్నెల్లి సోదరులను గృహ నిర్భందం చేశారు. మాచర్లలోకి వచ్చే వారి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లోనూ విస్తృతంగా పోలీస్ బలగాల పహారా కాస్తున్నాయి. గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి, పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాచర్లలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఇక గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని నరసరావుపేటలో హౌస్ అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేటలోనూ పోలీసుల హై అలర్ట్ ప్రకటించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు ఇళ్ల వద్ద భారీగా పోలీసుల మోహరించి వారిని బయటకు రావొద్దని సూచించారు.
ఏపీ ఊపిరి పీల్చుకో - పల్నాడులో తీరం దాటిన రాజకీయ తుపాను ! - AP Elections 2024
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు లాఠీఛార్జి చేశారు. గత రెండు రోజులుగా జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసాల వద్ద ఉన్న కార్యకర్తలను పోలీసులు లాఠీఛార్జి చేసి అదుపులోకి తీసుకున్నారు.
లాఠీఛార్జిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలో పనిచేసే దివ్యాంగుడు కిరణ్‌కుమార్, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గతంలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా పనిచేసిన డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో ఈ లాఠీఛార్జి జరగడం గమనార్హం. ఎలాంటి గొడవలు జరగకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డిని వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. ఇరు పార్టీల కార్యకర్తలు తాడిపత్రి పట్టణంలోకి రాకుండా పోలీసులు దారులన్నీ మూసివేశారు. 144 సెక్షన్ విధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నాటు బాంబులు, పెట్రోల్ సీసాల దాడులతో రక్తసిక్తమైన పల్నాడు - YSRCP attacks in Palnadu