Rushikonda Palace Maintenance Burden to NDA Govt : రుషికొండ భవనాలపై ఎలా ముందుకెళ్లాలో ప్రభుత్వానికి అర్థంకాని పరిస్థితి నెలకొంది. వాటిని ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై తర్జనభర్జన కొనసాగుతోంది. ప్రభుత్వ అవసరాలకే వినయోగించుకుందామా లేక ప్రైవేటుకు అప్పగించాలా అన్న అంశంపై సందిగ్ధం తొలగట్లేదు.
నిర్వహణ భారమే : విశాఖలో రుషికొండపై వైఎస్సార్సీపీ హయాంలో నిబంధనలు ఉల్లంఘించి దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి కట్టిన ప్యాలెస్‌ను ఇప్పుడు ఏం చేస్తారనే సందేహం అందరి మదిలో మెదులుతోంది. దీనిపై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. పర్యాటకశాఖపై సీఎం చంద్రబాబు పలుమార్లు సమావేశాలు నిర్వహించినా ఈ అంశం ప్రస్తావనకు రాలేదు. మంత్రులు దుర్గేశ్, లోకేశ్ విశాఖలో పర్యటించినా రుషికొండ భవనం చూడలేదు. ఈ భవనాలను ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తారా? ప్రైవేటుకు అప్పగిస్తారా? అన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే ఖాళీగా ఉన్న ఈ భవనాల నిర్వహణకు ప్రతి నెలా లక్షల్లో ఖర్చవుతోంది. విలువైన ప్రభుత్వ ఆస్తిని నిరుపయోగంగా ఉంచడం సరికాదని పలువురు సూచిస్తున్నారు. దీనిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రోజుకు రూ.లక్ష పైనే ఖర్చు : రుషికొండపై భవనాలను ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ - ఏపీటీడీసీకి పూర్తిస్థాయిలో అప్పగించినా ఎలా నిర్వహించాలో అంతు చిక్కట్లేదు. నిర్వహించే సామర్థ్యం, నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత ఉంది. వీటిని రిసార్టులకు కేటాయించినా అక్కడి నిర్మాణాలు అందుకు తగ్గట్లు లేవు. దీంతో వచ్చే ఆదాయం కన్నా నిర్వహణ తీవ్ర భారమవుతుందని భావిస్తున్నారు. అందుకే ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. రుషికొండపై 9.88 ఎకరాల్లో 1,41,438 చదరపు అడుగుల్లో 7 భవనాలు నిర్మించారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వాటి నిర్వహణకు రోజువారీ ఖర్చే లక్ష రూపాయలు దాటుతుందని ఇంజినీరింగ్ నిపుణుల అంచనా వేస్తున్నారు. అంటే ఏడాదికి దాదాపు రూ. 4 కోట్ల వరకు అవుతుంది. భవన నిర్వహణకు ప్లంబింగ్, నీటిసరఫరా, విద్యుత్, ఏసీ టెక్నీషియన్లు, ఉద్యానవన, హౌస్‌కీపింగ్‌కు రోజుకు 100 మంది వరకు సిబ్బంది అవసరమని అధికారులు తెలుపుతున్నారు. మరో 50 మంది షిఫ్టుల్లో పనిచేయాలి. ప్రస్తుతానికి ఆ స్థాయిలో నిర్వహణ లేదు. కొన్ని ఇనుప వస్తువులు తుప్పుపట్టాయి. కొన్ని ఏసీలు, ఇతర పరికరాలు వాడక ముందే పనిచేయనట్లు సమాచారం.
'21వ శతాబ్దపు నయా చక్రవర్తి'- రుషికొండ రాజమహల్లో కళ్లుచెదిరే నిర్మాణాలు - jagan bathroom
రూ.లక్షల్లో విద్యుత్తు బకాయి : రుషికొండ భవనాలకు విద్యుత్తు బిల్లుల బకాయి పేరుకుపోతోంది. అయిదు నెలల్లో ప్రతి నెలా సగటున 6 లక్షల పైనే బిల్లు వచ్చింది. ఇప్పటివరకు 85 లక్షల విద్యుత్తు బిల్లు బకాయి ఉంది. ఖాళీగా ఉన్న భవనాలకే ప్రతినెలా 40 వేల నుంచి 60 వేల యూనిట్ల విద్యుత్తు ఖర్చవుతుంది. అదే వినియోగంలోకి వస్తే ఇది మరో రెండింతలు అవుతుందని అంచనా. భవనాల వద్ద 10వేల 4 చదరపు మీటర్లలో 58 రకాల 2,15,518 మొక్కలు నాటారు. వీటిలో చాలావరకు విదేశాల నుంచి తెచ్చినవే. ప్రస్తుతం వీటి నిర్వహణ లేక కళావిహీనంగా మారిపోతున్నాయి. చాలా మొక్కలు ఎండిపోయాయి.
రుషికొండ ప్యాలస్ పై పసుపు జెండా రెపరెప - TDP Flag On Vizag Rushikonda Palace