RUMBLE STRIPS on roads : వాహనాల వేగ నియంత్రణ కోసం రహదారులపై స్పీడ్ బ్రేకర్ల ఉద్దేశం మంచిదే అయినా నిర్మాణ లోపాల కారణంగా ప్రమాదాలు ఎదురవుతున్నాయి. రోడ్లపై ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్స్ (రహదారిపై అడ్డుగా ఉండే తెల్లని గీతలు) వాహనదారుల జీవితాల్లో చీకట్లు నింపుతున్నాయి. హైదరాబాద్ రహదారులపై పలు ప్రాంతాల్లో నిర్మించిన ఈ రంబుల్ స్ట్రిప్స్ వల్ల ద్విచక్ర పరిస్థితి దారుణంగా తయారైందని వాహనదారులు వాపోతున్నారు.
రంబుల్ స్ట్రిప్స్ మీదుగా ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు క్షణాల్లో పది నుంచి 20 సార్లు కుదుపునకు గురవుతుండటం వాహనదారులకు అశనిపాతంలా మారింది. ముఖ్యంగా బైక్‌పై కూర్చున్న వారి వెన్నుపూస దెబ్బతింటోంది. సస్పెన్షన్ కూడా దెబ్బతింటుందని కార్లు, ఇతర భారీ వాహనదారులు వాపోతున్నారు. రంబుల్ స్ట్రిప్స్ వల్ల రహదారులపై గుంతలు పడుతున్నాయని జీహెచ్‌ఎంసీకి నిత్యం ఫిర్యాదులొస్తున్నాయి.
నిషేధం విధించినప్పటికీ..
హైదరాబాద్ - సికింద్రాబాద్ పరిధిలో రంబుల్ స్ట్రిప్స్‌పై వచ్చిన వరుస ఫిర్యాదులతో అప్పటి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. కొత్తగా ఎక్కడా ఏర్పాటు చేయొద్దని బల్దియాను ఆదేశించారు. ఈ మేరకు కొత్తగా రంబుల్ స్ట్రిప్స్‌ను ఏర్పాటు చేయొద్దంటూ 2023లో నాటి ఈఎన్సీ జియాఉద్దీన్ మెమో జారీ చేశారు.
కొత్తగూడ కూడలి పైవంతెనపై అడుగడుగునా ఏర్పాటు
ప్రైవేటు గుత్తేదారు సంస్థల నిర్వహణలోని సీఆర్‌ఎంపీ (కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్) రహదారులు, ఫ్లైఓవర్లు, ఇతర రహదారులపై రంబుల్‌స్ట్రిప్స్ నిర్మిస్తున్నారు. ఉప్పల్ నుంచి పంజాగుట్ట చౌరస్తా వరకు ప్రతి అరకిలోమీటరుకు ఓ రంబుల్ స్ట్రిప్ ఏర్పాటు చేశారు. ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ సర్కిల్ రెండు వైపులా, ఉప్పల్ స్టేడియం రోడ్డు, ఎన్‌జీఆర్‌ఐ, హబ్సిగూడ, తార్నాక మధ్య దాదాపు ప్రతి 200 మీటర్లకు ఒక రంబుల్‌స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు. బయోడైవర్సిటీ కూడలి పైవంతెనపై, షేక్‌పేట, ఎల్బీనగర్‌లో, కూకట్‌పల్లి జాతీయ రహదారికి ఇరువైపులా నిర్మించిన రంబుల్‌స్ట్రిప్స్ వాహనాదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎప్పుడో ఒకసారి వెళ్లే వారికి పెద్దగా ఇబ్బంది కాకున్నా తరచూ అదే మార్గంలో వెళ్లే వారికి తీవ్ర ముప్పుగా పరిణమించాయి.
ప్రమాదాల నివారణకే అంటున్నా...
వాస్తవానికి జాతీయ రహదారులపై వేగ నియంత్రికల (స్పీడ్ బ్రేకర్లు) నిర్మాణంపై ఐఆర్‌ఎస్ (ఇండియన్ రోడ్ కాంగ్రెస్) నిషేధం విధించింది. అయితే, నగర రోడ్లపై వాహనాల వేగాన్ని నియంత్రించడానికి రంబుల్ స్ట్రిప్స్ ఉపయోగించవచ్చని ఇంజినీర్లు చెబుతున్నా అవి కూడా 2.5మి.మీ నుంచి 15మీ.మీ ఎత్తుతో మాత్రమే ఉండాలి. వరుసల సంఖ్య, వరుసల మధ్య దూరం కూడా ప్రమాణాలకు విరుద్ధంగా ఉంటోందని వాహనదారులు ఆక్షేపిస్తున్నారు.
ఇకపై వెంటనే రోడ్ల మరమ్మతులు - త్వరలోనే కార్యరూపం
గ్రామాల్లోనూ హైవే తరహా రోడ్లు - తొలి విడతలో 18రూట్లు ఎంపిక
విజయవాడలో ఇక సాఫీగా ప్రయాణం - ఊపిరి పీల్చుకుంటున్న సామాన్యులు