RTC and Union Leaders Illegal Suspensions in AP : ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో స్వామి భక్తిని చాటుకున్న కొందరు ఆర్టీసీ అధికారులు ఎన్నికల కోడ్ ఉన్నా అదే తరహా భక్తిని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన పోరాడిన నేతలపై కసి తీర్చుకుంటున్నారు. గతంలో ప్రభుత్వానికి వ్యతిరేక స్వరం వినిపించిన ఉద్యోగులను టార్గెట్ గా చేసుకొని అడ్డగోలుగా సస్పెన్షన్లు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఏకంగా విధుల నుంచి తప్పిస్తామంటూ హెచ్చరిస్తున్నారు.
వైఎస్సార్సీపీ వీరవిధేయులుగా ఉన్న కొందరు ఆర్టీసీ అధికారుల తీరుతో ఉద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ సంస్థలోని ఉద్యోగులపై ఎడా పెడా సస్పెన్షన్ల వేటు వేస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని పది మంది ముందు చెప్పుకున్నా చాలు దీన్ని సాకుగా చూపి ఇంటికి పంపుతున్నారు. కింది స్థాయిలో కండక్టర్ నుంచి యూనియన్ లీడర్ల వరకూ అందరినీ టార్గెట్ చేసుకుని మరీ వేటు వేస్తున్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు ఈపీఎఫ్ అధిక పింఛను అందని ద్రాక్షేనా! - EPF Problem For RTC Employees
రాష్ట్రంలో మార్చి 16 న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనల మేరకు ఏదేనీ రాజకీయ పార్టీల సభల్లో ఉద్యోగులు పాల్గొనకూడదు. వారితో కలిసి ప్రచారం చేయకూడదు. అలా చేస్తే సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకునే అధికారం ఈసీకి ఉంటుంది. ఉల్లంఘనలపై స్పష్టమైన ఆధారాలు ఉంటేనే చర్యలు తీసుకోవాలని నిబంధన. కానీ ఆర్టీసీలోని స్వామి భక్తి ప్రదర్శించే అధికారుల తీరే వేరు. ఏలూరు జిల్లా ఆర్టీసీ అధికారులు ఎన్నికల కోడ్ పేరు చెప్పి టార్గెట్ చేసుకున్న ఉద్యోగ సంఘాల నేతలు, సిబ్బందిపై వేటు వేశారు.
ఈనెల 4 న ఏలూరులో కేఆర్ సూర్యనారాయణ ఆధ్వర్వంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఇందులో ఆర్టీసీలోని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సీ.హెచ్. సుందరరావు సహా బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యాంసన్, ఎన్‌ఎంయూ తణుకు డిపో కార్యదర్శి సుబ్బారావు పాల్గొన్నారు. దీన్ని తప్పిదంగా భావించిన ఏలూరు జిల్లా ఆర్టీసీ అధికారులు ఆఘమేఘాలపై వారిపై చర్యలకు ఉపక్రమించారు. ముగ్గురు యూనియన్ నేతలకు చార్జ్ షీట్ జారీ చేశారు. తాము వేదికపైకి ఎక్కలేదని మీడియాలో ప్రసంగాలు చేయలేదని వివరణ ఇచ్చినా అంగీకరించలేదు.
ఈనెల 9న ఏలూరు డీపీటీవో అధికారి కార్యాలయంలోని అకౌంట్స్ ఆఫీసర్ సంతకం చేసి సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేశారు. ఆర్టీసీలో కార్మిక సంఘంగా గుర్తింపు పొంది, వేలాదిమంది కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తోన్న తమనే అక్రమంగా సస్పెండ్ చేశారని యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీలో ఇటీవల 146 మందిని సస్పెండ్ చేయగా వీరిలో 52 మంది ఏలూరు జిల్లాకు చెందిన ఉద్యోగులేనని యూనియన్ నేతలు తెలిపారు.
బస్సుల ఏర్పాటులో ఏపీఎస్ఆర్టీసీ విఫలం - ప్రయాణికుల ఇబ్బందులు - Passengers Problems In Ap
విలీనంతో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హక్కులు వస్తాయని వేధింపులకు తెరపడుతుందని ఉద్యోగ భద్రత ఉంటుందని వేలాది మంది ఆశించారు. విలీనం అయ్యాక వేధింపులు, సస్పెన్షన్లలో ఎలాంటి మార్పు రాకపోగా మరింత పెరిగాయని కార్మిక సంఘాలు వాపోతున్నాయి.
ఆర్టీసీలో కార్మిక సంఘాల నేతల సస్పెన్షన్ పై ఆల్ ఇండియా ట్రాన్స్ పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ సస్పెన్షన్లు ఎత్తి వేయాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావుకు సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య లేఖ రాశారు.