Heavy Liquor Seizure at Mahabubnagar : మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.2 కోట్ల విలువైన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గోవా రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం రాజమండ్రికి తరలిస్తున్న ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు బాలానగర్ చౌరస్తాలో వాహనాల తనిఖీల్లో భాగంగా గుర్తించారు. లారీలో 80% మందు కాటన్లు నింపి అందులో మిగతా భాగంలో వర్మి కంపోస్ట్ అనే ఎరువును నింపి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం.
పట్టుకున్న మందు రాయల్ క్వీన్ 1200 కాటన్లు, రాయల్ బ్లూ 800 కాటాలు ఉన్నాయని పోలీసు అధికారులు తెలిపారు. కాటన్లో 48 సీసాల ఉన్నాయని మహబూబ్‌నగర్ జిల్లా డీఎస్పీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. పట్టుబడ్డ మద్యం మొత్తం రూ.2,07,36,000 విలువ ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని మిగిలిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల వేళ భారీగా మద్యం పట్టివేత : పోలింగ్‌కు 2 రోజుల ముందు పెద్ద మొత్తంలో మద్యం పట్టుబడటం చర్చకు దారితీస్తోంది. ఈ మద్యాన్ని ఎవరు, ఎక్కడి నుంచి, ఎక్కడికి తరలిస్తున్నారు? ఎవరి కోసం తీసుకెళ్తున్నారన్న విషయాలు తెలియాల్సి ఉంది. మరికొద్ది గంటల్లో పోలీసులు దీనిపై అధికారిక సమాచారం వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
Cash Found in Accident case : మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో నగదును అక్రమంగా తరలిస్తున్న ఓ వాహనం ప్రమాదానికి గురై భారీ మొత్తంలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. అనంతపల్లి వద్ద టాటా ఏస్ వాహనాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బోల్తాపడిన టాటా ఏస్ వాహనంలో 7 అట్టపెట్టెల్లో పెద్ద మొత్తంలో సొమ్మును స్థానికులు గుర్తించారు.
అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఎవరికీ అనుమానం రాకుండా తౌడు బస్తాల మధ్య నగదును దాచి అక్రమంగా పెట్టెలను తరలిస్తున్న ఉదాంతం పోలీసులకు చిక్కింది. కాగా డబ్బులు లెక్కించేందుకు అధికారులు మిషన్ తెప్పిస్తున్నారు. నగదు లెక్కింపునకు వీరవల్లి టోల్‌ప్లాజా వద్దకు ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్లారు. ప్రమాదానికి గురైన టాటా ఏస్ వాహనం, విజయవాడ వైపు నుంచి విశాఖ వెళ్తున్నట్లు సమాచారం.
సాయంత్రం వరకే ఛాన్స్ - నేటి నుంచి 2 రోజులు వైన్స్ బంద్! - Wine Shops Close in Telangana