Accidents on National Highway 544D : ఏదైనా అభివృద్ధి ప్రాజెక్టు గ్రామం గుండా వచ్చిందంటే అక్కడి ప్రజలంతా సంతోష పడతారు. నేషనల్ హైవేల వంటివి తమ ఊరి నుంచి వెళ్తుంటే ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని ఆనందిస్తారు. కానీ పల్నాడు జిల్లాలోని కొత్తపాలెం గ్రామస్థులు మాత్రం 544-డీ నేషనల్ హైవే వల్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. హైవేకు ఉండాల్సిన కనీస ప్రమాణాలు లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.
జాతీయ రహదారి అంటే నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అందుకే వాటిపై ప్రమాదాలు జరగకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించడంతో పాటు ఇంజినీరింగ్ లోపాలు లేకుండా నిర్మిస్తారు. కానీ పల్నాడు జిల్లా వినుకొండ మీదుగా వెళ్లే 544-డీ నేషనల్ హైవే మాత్రం దీనికి భిన్నంగా ఉంది. గుంటూరు నుంచి కర్నూలు వెళ్లే ఈ హైవేపై వినుకొండ నుంచి ఎర్రకొండపాలెం మధ్య చీకటీగలపాలెం వై-జంక్షన్, కొత్తపాలెం మూల మలుపులు, మార్కాపురం రోడ్డులోని పసుపులేరు మూల మలుపు వద్ద నిర్మాణ లోపాలతోఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కొత్తపాలెం వద్ద అయితే వారంలో కనీసం రెండు మూడు ప్రమాదాలు జరుగుతున్నాయి.
తిరుమల శ్రీవారి హుండీలో నగదు చోరీ
Highway problems in Kothapalem : కొత్తపాలెం గ్రామం జాతీయ రహదారికి ఇరు వైపులా ఉంది. కానీ అధికారులు ఇక్కడ సర్వీస్ రోడ్డు, అండర్ పాస్ నిర్మించలేదు. పైగా ఇక్కడ ఎస్ ఆకారంలో ఉన్న మలుపు వల్ల వాహన డ్రైవర్లు నియంత్రణ కోల్పోతున్నారు. మరోవైపు రహదారిపై లైటింగ్ కూడా ఏర్పాటు చేయలేదు. ఫలితంగా గత మూడేళ్లలో ఇక్కడ జరిగిన ప్రమాదాల వల్ల ముప్పై మంది మరణించగా సుమారు 200 మంది గాయపడ్డారు. మూగ జీవాలైన గేదెలు, గొర్రెలు, మేకలు సైతం వాహనాల కింద పడి చనిపోయాయి.
"ఊరంతా ఓ వైపు ఉంది. మరోవైపు పొలాలు ఉన్నాయి. ఉదయం నుంచి లేచిన మొదలు ప్రతిసారి రోడ్డు దాటాల్సి వస్తోంది. ఎస్ ఆకారంలో మలుపు ఉండటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారిపై లైటింగ్ కూడా ఏర్పాటు చేయలేదు. రాత్రి సమయంలో ప్రమాదాలు జరగటం వల్ల బాధితులకు ఆసుపత్రికి తరలించటం, సకాలంలో వైద్యం అందించటం సమస్యగా మారింది. అందుకే ఈ మార్గంలో రాత్రివేళల్లో పెట్రోలింగ్ నిర్వహించడం, రహదారి భద్రతపై అవగాహన కల్పించాలి. అర్ధరాత్రి వేళ ఇళ్లపైకి వాహనాలు దూసుకొస్తున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు." - స్థానికులు
అర్ధరాత్రి వేళ వాహనాలు ఇళ్లపైకి దూసుకొస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరగడం వల్ల బాధితులను ఆసుపత్రికి తరలించడం, సకాలంలో వైద్యం అందించడం కష్టమవుతోందని అంటున్నారు. ఈ విషయంపై అధికారులకు పలుమార్లు విన్నవించినా ప్రమాద హెచ్చరిక బోర్డులతో సరిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"ఆగిపోతే అడవిలోనే" - కర్నూలు - గుంటూరు హైవేపై వాహనదారుల అవస్థలు
కొండమోడు రహదారి విస్తరణకు సర్కార్ నిర్ణయం- అమరావతి, హైదరాబాద్ మధ్య మార్గం సుగమం - KONDAMODU ROAD