Andhra Style Natu Kodi Chicken Biryani : తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే సంక్రాంతి సందడి మొదలైపోయింది. ఇప్పటికే చాలా మంది అరిసెలు, జంతికలు, లడ్డూలు, కారపూస వంటి వివిధ రకాల పిండి వంటలు సిద్ధం చేసేస్తున్నారు. అయితే, సంక్రాంతి, మరీ ముఖ్యంగా కనుమ పండుగ అనగానే మనందరికీ నోరూరించే నాన్‌వెజ్ వంటకాలు గుర్తుకొస్తాయి. ఏ ఇంట్లో చూసినా చికెన్, మటన్ ఘుమఘుమలతో నిండిపోతుంది. అయితే, ఈ సంక్రాంతి మరింత గుర్తుండిపోవాలంటే ఒక్కసారి ఈ స్టోరీలో చెప్పివ విధంగా నాటుకోడి బిర్యానీ ట్రై చేయండి. టేస్ట్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో ప్రతి ఒక్కరు అడిగి మరీ మరోసారి బిర్యానీ వండించుకుని తింటారు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఆంధ్రా స్టైల్ స్పైసీ నాటుకోడి బిర్యానీ ఎలా చేయాలో ఓ లుక్కేయండి.
కావాల్సిన పదార్థాలు :
- చికెన్ ముక్కలు - కిలో
- బాస్మతి బియ్యం- 3 గ్లాసులు
- ఉప్పు-తగినంత
- లవంగాలు-2
- యాలకులు-3
- దాల్చిన చెక్క-1
- అనాస పువ్వు-1
- బిర్యానీ ఆకు-1
- కరివేపాకు-2
- ఉల్లిపాయ తరుగు - కప్పు
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - టేబుల్‌స్పూన్
- పెరుగు - అర కప్పు
- నూనె-తగినంత
- నెయ్యి -2 టేబుల్‌స్పూన్లు
- పసుపు-పావు టీస్పూన్
- కొత్తిమీర తరుగు - పిడికెడు
- పుదీనా తరుగు - పిడికెడు
బిర్యానీ మసాలా కోసం :
- ఎండుమిర్చి-18
- బిర్యానీ ఆకు
- ధనియాలు-2 టేబుల్‌స్పూన్లు
- అనాసపువ్వు-1
- యాలకులు-4
- లవంగాలు-6
- దాల్చినచెక్క-రెండు చిన్నవి
- మిరియాలు-15
- జాపత్రి-కొద్దిగా
- జీలకర్ర-టీస్పూన్
- సోంపు-టీస్పూన్
- పచ్చికొబ్బరి ముక్కలు-పావుకప్పు
- గసగసాలు-టేబుల్‌స్పూన్
తయారీ విధానం :
- బిర్యానీ కోసం ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంటపాటు నానబెట్టుకోవాలి.
- అదేవిధంగా బిర్యానీలోకి కావాల్సిన టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- ఇప్పుడు స్టౌపై ప్రెషర్ కుక్కర్ పెట్టండి. ఇందులో అరకప్పు ఆయిల్ పోసి వేడి చేయండి. ఆపై చికెన్ ముక్కలు వేసి వేపండి.
- ఆపై కాస్త ఉప్పు వేసి చికెన్ ముక్కలపై గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి.
- ఆపై పసుపు వేసి ఫ్రై కాసేపు వేపండి.
- ఇప్పుడు ఇందులో అర లీటర్ నీరు పోసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఆపై స్టౌ ఆఫ్ చేయండి.
- బిర్యానీలోకి కావాల్సిన మసాలా రెడీ చేయడం కోసం స్టౌపై పాన్ పెట్టండి. ఇందులో ఎండుమిర్చి వేసి కాసేపు వేపండి. ఆపై ధనియాలు, అనాసపువ్వు, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి, జీలకర్ర, మిరియాలు, బిర్యానీ ఆకు, సోంపు వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోవాలి.
- మసాలాలు వేగి మంచి సువాసన వస్తున్నప్పుడు పచ్చికొబ్బరి ముక్కలు, గసగసాలు వేసి కాసేపు ఫ్రై చేయాలి. ఆపై వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి.
- తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని కొన్ని నీళ్లు యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
- ఇప్పుడు నాటుకోడి బిర్యానీ చేయడం కోసం స్టౌపై అడుగు మందంగా ఉండే బిర్యానీ హండీ పెట్టండి.
- ఇందులో నూనె వేసి వేడి చేయండి. ఇందులో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, కరివేపాకు వేసి కాసేపు వేయించుకోవాలి.
- ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి.
- ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కాస్త ఉప్పు వేయండి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపండి.
- ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న బిర్యానీ మసాలా పేస్ట్, చిలికిన పెరుగు, కాస్త కొత్తిమీర, పుదీనా తరుగు వేసి కలపండి. నూనె పైకి తెలిన తర్వాత రైస్ వేసి కలపండి.
- రైస్‌కి మసాలా బాగా పట్టిన తర్వాత కుక్కర్లో ఉడించుకున్న చికెన్ నీళ్లతో సహా వేసి కలపండి.
- ఇందులో టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసి కలుపుకోండి.
- తర్వాత మూడున్నర కప్పుల వేడివేడి నీరు పోసి మిక్స్ చేయండి. ఇప్పుడు హండీపై మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 10 నిమిషాలు ఉడికించుకోండి.
- అనంతరం మరోసారి కలిపి హండీని అట్లపెనం పైన ఉంచి స్టౌపై పెట్టండి.
- ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో 20 నిమిషాలు ఉడికించుకోండి.
- తర్వాత స్టౌ ఆఫ్ చేసి కదపకుండా 20 నిమిషాలు అలా వదిలేయండి.
- అంతే ఇలా చేసుకుంటే ఘుమఘుమలాడే నాటుకోడి బిర్యానీ మీ ముందుంటుంది.
- ఈ బిర్యానీ రైతాతో తింటే టేస్ట్ అద్దిరిపోతుంది.
- బిర్యానీ నచ్చితే మీరు కూడా ఈ సంక్రాంతికి ట్రై చేయండి.