Road Accidents in Andhra Pradesh 2024 : రహదారి ప్రమాదాలకు ఆంధ్రప్రదేశ్ చిరునామాగా మారిపోయింది. రాష్ట్రంలో ప్రతి నిత్యం ఏదో ఒక చోట భారీ ప్రమాదం సాధారణమైపోయింది. ఇటీవల కాలంలో ఇవి మరింత కలవరపెడుతున్నాయి. ఈ నెల 14న అర్ధరాత్రి చిలకలూరి పేట వద్ద ప్రైవేటు బస్సు, డీజిల్ లారీని ఢీకొట్టడంతో మంటలు వ్యాపించి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను మరచిపోకముందే ఈనెల 18న మరో ఘోర ప్రమాదం సంభవించింది. అనంతపురం జిల్లా గుత్తి వద్ద ఓ కారు హైవేపై అదుపు తప్పి డివైడర్ దాటి వెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఆరుగురు మరణించారు. ఇలా వరుస ప్రమాదాలతో రాష్ట్ర రహదారులపై నెత్తుటేళ్లు పారుతున్నాయి. రాష్ట్రంలో సగటున నెలకు 1,600 వరకు ప్రమాదాలు జరిగితే, అందులో 660 నుంచి 680 మంది ప్రాణాలు కోల్పోతున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో జరుగుతున్న రహదారి ప్రమాదాలు ప్రధానంగా అతివేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే జరుగుతున్నాయి. బస్సులు, లారీ డ్రైవర్ల ఓవర్ డ్యూటీలు కూడా ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. విశ్రాంతి లేకుండానే నిరంతరం వాహనం నడుపుతూ అసలటతో కనురెప్ప వాల్చడంతో ఘోర ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక రోడ్లపై, ముఖ్యంగా జాతీయ రహదారులపై ఎక్కడికక్కడ వాహనాలను నిలిపి ఉంచడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది.
జాతీయ రహదారులపై వాహనాలు సాధారణంగా అతి వేగంగా ప్రయాణిస్తుంటాయి. ఆగి ఉన్న వాహనాలు ఒక్కోసారి దగ్గరకు వచ్చే వరకు కనిపించకపోవడం, కనిపించినా దారి ఇరుకుగా ఉండి డ్రైవర్లు వాహనాన్ని నియంత్రించలేక ఆగి ఉన్న వాహనాలను ఢీ కొడుతున్నారు. ఫలితంగా క్షణాల వ్యవధిలో భారీగా ప్రాణ నష్టం జరుగుతోంది.
- సి.హెచ్. నరసింగరావు, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి
జాతీయ రహదారులపై అతివేగం, నిద్రమత్తు, మద్యంతో అధిక ప్రమాదాలు జరుగుతుండగా రాష్ట్ర రహదారులపై మాత్రం పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చోటు చేసుకుంటున్నాయి. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రోడ్లపై తట్టెడు తారు, సిమెంటు కూడా వేయలేదు. కొత్త రోడ్లు వేయలేదు, ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయలేదు. ఎక్కడ చూసినా రోడ్లపై గుంతలే. జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలను కలిపే రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రోడ్ల పరిస్ధితి చెప్పాల్సిన పని లేదు. అత్యంత దారుణంగా ఉండే ఈ రోడ్లపై గజానికో గుంత, అడుగుకో గొయ్యి దర్శనమిస్తుంది. రహదారులు ఇంత అధ్వాన్నమగా మారినా ప్రభుత్వ యంత్రాంగానికి గత ఐదేళ్లలో పట్టింపే లేకుండా పోయింది. ప్రభుత్వ పెద్దల నుంచి కింది స్థాయి నాయకులు, అధికారుల వరకు అందరిదీ ఒకే రకమైన నిర్లక్ష్యం. వాహనదారులు వేరే దిక్కు లేక తప్పనిసరై ఈ రోడ్లపైనే ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఒక రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది అని తెలియాలంటే ఆ రోడ్లను చూస్తే అర్థం అవుతుంది. అయితే రాష్ట్రంలోని రహదారుల మీదుగా ప్రయాణించే ఇతర రాష్ట్రాల వారు ఇక్కడి పరిస్థితిని చూసి తిట్టుకుంటున్నారు. ఎన్నో రాష్ట్రాల మీదుగా ప్రయాణించే లారీ డ్రైవర్లు ఏపీలో ఉన్నంత దారుణమైన రోడ్లు మరెక్కడా చూడలేదని అంటున్నారు. ఇక్కడి రోడ్లు ఐదేళ్లు సాగిన జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. రహదారులే కాదు, దెబ్బతిన్న కల్వర్టులు, కాజ్‌వేలు చాలా వరకు దెబ్బతిన్నా ఒక్క సారి కూడా మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి సారించలేదు. ఫలితంగా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి.
రాష్ట్రంలో రవాణా శాఖ సిబ్బంది నిర్లక్ష్యం కూడా రోడ్డు ప్రమాదాల పెరుగుదలకు కారణం. వీరు కొంత కాలంగా రోడ్లపై వాహనాల తనిఖీలు మరిచిపోయారు. అడపాదడపా తనిఖీలు చేస్తూ ఫిట్‌నెస్ లేని వాహనదారుల నుంచి జరిమానాలు విధించి మమ అనిపిస్తున్నారు. ప్రమాదాల నివారణ, అవగాహన చర్యలపై కనీస చర్యలు తీసుకోవడం లేదు. వాహనాలు విపరీతంగా పెరుగుతున్నా అందుకు తగ్గట్లుగా జగన్ సర్కార్ మోటారు వెహికిల్
ఇన్‌స్పెక్టర్లను నియమించలేదు. దీంతో తనిఖీలు అతీగతీ లేకుండా పోయాయి. ప్రభుత్వం నిర్దేశించిన రాబడి లక్ష్యాన్ని చేరుకోవడానికి మాత్రమే తనిఖీలు చేసి భారీ జరిమానాలు విధిస్తున్నారు. అంతే తప్ప వేగ నియంత్రణ, మద్యం మత్తులో డ్రైవర్లు వాహనాలు నడపకుండా చూడటంలేదు. సాధారణ రోజుల్లో తనిఖీలు చేసే పోలీసులు కూడా ఆ పనిని పక్కన పెట్టారు. ఇలా రహదారులపై సరైన నియంత్రణ లేక రాష్ట్రం అంతటా రోడ్డు ప్రమాదాలు సాధారణ విషయంగా మారిపోయాయి.
ప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన రహదారి భద్రతా విభాగాన్ని వైకాపా సర్కారు పూర్తిగా నిర్వీర్యం చేసింది. సీఎం అధ్యక్షతన ఉండే ఈ విభాగం తరచూ రవాణా శాఖ, పోలీసు, ట్రాఫిక్ తదితర విభాగాలతో సమావేశమై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. గత ప్రభుత్వాల్లో సీఎం నేతృత్వంలో నిరంతరం భేటీలు జరిగేవి. సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో ఈ భేటీలను నిలిపివేశారు. కనీసం జిల్లా స్థాయిలోనూ కలెక్టర్ అధ్యక్షతన ప్రతి నెలా తొలి వారంలో రహదారి భద్రతా విభాగం సమావేశమై ప్రమాదాలను తగ్గించేందుకు నిర్ణయాలు తీసుకోవాలి. అయితే వాటి ఊసేలేకపోవడంతో రాష్ట్రంలో రహదారులు నెత్తురోడుతూనే ఉన్నాయి.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి- పదుల సంఖ్యలో క్షతగాత్రులు` - ROAD ACCIDENTS
ఆర్టీసీ బస్సుల వల్ల కూడా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్టీసీలో డొక్కు బస్సులు, సుశిక్షితులైన డ్రైవర్ల లేమి వంటి సమస్య ఉంది. 10 వేల 600 ఆర్టీసీ బస్సులు తిరుగుతుండగా వీటికి సరపడా సుశిక్షితులైన డ్రైవర్లు లేరు. వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క డ్రైవర్ పోస్టునూ భర్తీ చేయలేదు. దీంతో తప్పని సరి పరిస్ధితుల్లో అద్దెబస్సుల డ్రైవర్లు, కాల్ డ్రైవర్లతో నడిపిస్తోంది. డ్రైవర్లకు విరామ లేకుండా అధిక పని గంటలు డ్యూటీ లు వేయడం, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, వీరిపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వంటి కారణాల వల్ల ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
రహదారుల పట్ల నిర్లక్ష్యం, పట్టింపులేనితనంతో అయిదేళ్ల వైఎస్సార్సీపీ పాలన ముగింపు దశకు వచ్చింది. రహదారి ప్రమాదాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది దివ్యాంగులుగా మారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ పరిస్థిని అరికట్టేందుకు ఇకనైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రహదారి ప్రమాదాల నివారణకు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.
అధ్వాన్నంగా మారిన రహదారులను యుద్ధ ప్రాతిపదికన బాగు చేయడం ఇందులో మొట్టమొదటి పని. హైవేలపై నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించి, మధ్యలో నిలిపి వుంచిన లారీలు, ఇతర వాహనాలను వెంటనే తొలగించేలా చూడాలి. రాష్ట్ర రహదారుల్లో కూడా వాహనాలు రోడ్ల పక్కన దాబాలు, హోటళ్ల వద్ద నిలిపేయకుండా, ఖాళీ ప్రదేశాల్లో ఆపేలా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలి. లారీలు, బస్సులు అన్నింటికి వెనుక ఎరుపు రంగు రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా ఉండేలా చూడాలి. దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాల డ్రైవర్లకు తప్పనిసరిగా తగినంత విశ్రాంతి ఉండేలా వాటి యజమానులు చర్యలు తీసుకోవాలి. - భవానీ ప్రసాద్, నిపుణుడు
రహదారి ప్రమాదాలు ప్రజల ప్రాణాలతో ముడిపడిన అంశం. వారి ప్రాణాలు కాపాడుకోవడం తక్షణ అవసరం. అందువల్ల ప్రమాదాల నివారణకు అధికార యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాలి. నిపుణులు చెప్పిన సూచనలను కఠినంగా అమలు చేయాలి. లేకుంటే రాష్ట్ర రహదారులపై ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంటాయి. ప్రజల ప్రాణాలు పోతూనే ఉంటాయి.