Bhogapuram Road Accident Today : నిత్య జీవితంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. మరీ ముఖ్యంగా రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. మనం బాగానే వాహనం నడుపుతున్నా ఇతరులు ఏ విధంగా వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నారో చెప్పలేని పరిస్థితి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేస్తున్నా కొన్నిసార్లు ఇతరులు చేసినా తప్పులకూ ఎందరో అమాయకులు బలవుతున్నారు.
తాజాగా ఆ వ్యక్తి నూతనంగా కారును కొనుగోలు చేశాడు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించుకుని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. కానీ అప్పటి వరకూ సంతోషంగా గడిపిన వారిని ఊహించని రోడ్డు ప్రమాదం ఛిన్నాభిన్నం చేసింది. ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో చెట్టును ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను చికిత్స నిమిత్తం పిడుగురాళ్ల ఆసుపత్రికి తరలించారు.
Road Accident in Brahmanapalli : మృతులు నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురం వాసులుగా పోలీసులు గుర్తించారు. వారు తుళ్లూరి సురేష్, వనిత, యోగులు, వెంకటేశ్వర్లు అని తెలిపారు. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. కొత్తకారుకు పూజలు చేయించేందుకు వీరంతా కొండగట్టుకు వెళ్లారని వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఘటనా స్థలాన్ని పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పారు. నిద్ర మత్తులో కారు చెట్టును ఢీకొట్టినట్లు డ్రైవర్ తెలిపాడని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా వాసి ఇటీవలే కొత్త కారు కొన్నారని వివరించారు. మొక్కుల కోసం కారులో పుణ్యక్షేత్రాలకు వెళ్లారన్నారు. ఈ క్రమంలోనే యాదాద్రి, కొండగట్టు దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.
బాపట్ల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పర్చూరు మండలం అన్నంబోట్లవారిపాలెం అంజనేయస్వామి దేవాలయం వద్ద స్కూటీని మట్టి లోడ్‌తో వస్తున్న టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అత్తా, అల్లుడు, కూతురు మృతి చెందారు. మృతులు మేదరమెట్ల వాసులుగా గుర్తించారు. చీరాల మండలం వాడరేవు కు సముద్రస్నానానికి వచ్చిన ముగ్గురు సాయంత్రం తిరుగు ప్రయణమయ్యారు. ఈ క్రమంలో అన్నంబోట్లవారిపాలెంలోని ఆంజనేయస్వామి దేవాలయం వద్దకు వచ్చేసరికి రహదారి పనులు చేస్తున్న మట్టి టిప్పర్ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో షేక్ మస్తాన్ వలి(30), షేక్ అమీరున్(20)దంపతులు అక్కడిక్కడే మృతి చెందారు. మార్టూరు మండలం కొనంకికి చెందిన అత్త షేక్ చిన బుడెమ్మ(40) ను చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పర్చూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.