Boats Removal At Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ వద్ద ఈ నెల 10 న ప్రారంభమైన భారీ పడవల తొలగింపు ప్రక్రియ రెండు రోజులుగా కొనసాగుతూనే ఉంది. మంగళవారం తొలి రోజున ఒక్కొక్కటి 50 టన్నుల చొప్పున మొత్తం 100 టన్నుల బరువు ఎత్తే రెండు బాహుబలి క్రేన్లతో ఎత్తినా, పలువిధాలా ప్రయత్నించినా భారీ పడవ ఇంచు కూడా కదల్లేదు. ప్రయోజనం లేదని భారీ పడవలను ముక్కలుగా కోసి బయటకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. డైవింగ్ టీంలను రంగంలోకి దింపి పడవలను కోసి బయటకు తీయాలని తీర్మానించారు.
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న బోట్లను తొలగించడం క్లిష్టంగా మారుతోంది. విశాఖ నుంచి వచ్చిన గజ ఈత గాళ్ల (స్కూబా డైవింగ్) బృందం పడవలను రెండు ముక్కలుగా కత్తిరించే పని ప్రారంభించింది. బుధవారం రోజంతా శ్రమిస్తే ఒక బోటును 12 మీటర్ల మేర కత్తిరించగలిగారు. ఇటీవల వరదలకు భారీ బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే.
రెండు గేట్ల కౌంటర్ వెయిట్లు ధ్వంసం కాగా జలవనరుల శాఖ నిపుణుడు కన్నయ్యనాయుడి (Kannaiah Naid1u) ఆధ్వర్యంలో రెండింటిని ఏర్పాటు చేశారు. 5 బోట్లలో 3 గేట్ల వద్ద ఉన్నాయి. ఒకటి ప్రవాహంలో కొట్టుకుపోగా మరొకటి నీటి అడుగు భాగానికి చేరినట్లు అంచనా వేస్తున్నారు. ఒక్కోటి 40 టన్నుల వరకు బరువు ఉండడం, 3 బోట్లు ఒకదానితో మరొకటి లింకు చేసి ఉండడంతో క్రేన్ల ద్వారా ఎత్తలేకపోయారు. దీంతో వాటిని ముక్కలుగా కత్తిరించి తొలగించేందుకు విశాఖకు చెందిన సీ లయన్ అనే బృందాన్ని రంగంలోకి దించారు. మొత్తం 10 మంది స్కూబా డైవర్లు వచ్చారు. నీటిలో మునిగి బోటు కింది భాగంలో గ్యాస్ కట్టర్లతో కత్తిరిస్తున్నారు. పడవ చుట్టుకొలత 40 మీటర్ల వరకు ఉందని చెబుతున్నారు. మొత్తం కత్తిరిస్తే ముక్కలను వెలికి తీసేందుకు అవకాశం ఉంటుంది.
ఒక్క బోటు ఖరీదు రూ.50 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇంత విలువైన పడవలు తమవేనని ఎవ్వరూ ముందుకు రాకపోవడం అనుమానాలకు తావిస్తోందని అధికారులు తెలిపారు. ఈ బోట్లను తొలగించేందుకు, ధ్వంసమైన కౌంటర్ వెయిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.