Relief Works in Vijayawada Flood Affected Areas: విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలు సాధారణస్థితికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వరద నీరు తొలగింది. మరికొన్ని కాలనీలు నీటిలో ఉన్నా పరిస్థితి కొంత మెరుగు పడింది. వరద నీరు తగ్గటంతో సింగ్‌నగర్ ఫ్లైఓవర్ మీదుగా వాహనాలను అనుమతించారు. వరద నీటి నుంచి బయటపడిన తమ ఇళ్లను చూసుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. గడిచిన ఐదు రోజులుగా చీకట్లో మగ్గిన ఈ ప్రాంతాలకు విద్యుత్ శాఖ కరెంటు పునరుద్ధరించింది.
కొద్దిపాటి నీళ్లు మాత్రమే ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించటంతో ముంపు ప్రాంతాల్లో వెలుగులు కనిపిస్తున్నాయి. అజిత్ సింగ్ నగర్ సహా వివిధ చోట్ల ఇప్పటి వరకూ 90వేల సర్వీసుల్ని పునరుద్ధరించినట్టు ఏపీ విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలియచేశారు. ఇంకా వరద నీటిలోనే ఉన్న సింగ్‌నగర్‌లోని కొన్ని ప్రాంతాలు, రాజరాజేశ్వరీ పేట, వాంబే కాలనీల్లో ప్రమాదాలు జరిగే అవకాశమున్నందున విద్యుత్ ఇంకా పునరుద్ధరించలేదని చెప్పారు. వరద ముంపుతో ప్రభావితమైన విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్‌లో యూనిట్లు నేడు ప్రారంభిస్తామని ఏపీ జెన్కో సీఎండీ చక్రధర్ బాబు తెలిపారు.
విజయవాడలో వరద బీభత్సానికి పెద్ద సంఖ్యలో కార్లు దెబ్బతిన్నాయి. ఇంటి సెల్లార్లోనే కాకుండా రోడ్డుపక్క పార్కు చేసిన కార్లు సైతం వరద ఉద్ధృతికి తలకిందులయ్యాయి. వరదతగ్గడంతో దెబ్బతిన్నకార్లను అతికష్టంమీద షోరూమ్‌లకు తరలించిన యజమానులు వాటికి మరమ్మతు చేయించేందుకు తంటాలు పడుతున్నారు. ఒక్కో కారుకు కనిష్టంగా 70 వేల నుంచి లక్షల రూపాయలకు మించే ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. విజయవాడ శివారు ప్రాంతాల్లోని కార్ల షో రూమ్ 4 రోజులు నీటిలోనే నానిపోయింది. శివారుల్లో టాటా, హుందాయ్ ఇతర కార్ల కంపెనీల గోడౌన్లు, షోరూమ్‌ల్లోకి నీరు చేరింది. వాహనాలకు బీమా కల్పిస్తామంటూ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై వారు ఒకింత ఆశలు పెంచుకున్నారు.
వరద నష్టంపై నేడు కేంద్రానికి నివేదిక పంపుతాం: సీఎం చంద్రబాబు - Chandrababu on Floods Damage in AP
వందకుపైగా ఫైరింజన్లతో ఇళ్లు, వీధులు శుభ్రం చేసే ప్రక్రియ కొనసాగుతుండగా వీధుల్లో పెరుకుపోయిన వ్యర్థాలను వేగంగా తొలిగిస్తున్నారు. వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ లిక్విడ్‌ని వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా చల్లారు.