Red Clay Hills Destruction in Andhra Pradesh: కాకినాడ జిల్లా రామేశంపేట మెట్ట, గుండ్ల మెట్ట పరిధిలోని ఎర్రమట్టి కొండల్ని గత ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ నేతలు కొల్లగొట్టారు. కొండలు కనుమరుగై చెరువుల్ని తలపిస్తుండగా, విద్యుత్ స్తంభాలు గాలిలో తేలుతూ ప్రమాదకరంగా మారాయి. కూటమి ప్రభుత్వం మారిన తర్వాత చర్యలు చేపట్టినా, అక్రమ తవ్వకాలు మాత్రం ఆగడం లేదు
కాకినాడ జిల్లాలోని ఎర్రమట్టి కొండలివి. గండేపల్లి, పెద్దాపురం మండలాల పరిధిలోని 823 ఎకరాల విస్తీర్ణంలో రామేశ్వరంపేట మెట్ట, గుండ్ల మెట్టలో విస్తరించి ఉన్నాయి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1987లో దళిత రైతులకు ఈ కొండ భూమిలో పట్టాలు ఇచ్చారు. జీడిమామిడి, అంతర పంటల్ని ప్రోత్సహించి జీవనోపాధి కల్పించారు. ఇక్కడి ఎర్రమట్టి నిల్వలపై కన్నేసిన కొందరు నేతలు భూ యజమానుల నుంచి కారుచౌకగా డీ-పట్టా, అసైన్డ్ భూములు దక్కించుకున్నారు.
ఆపై అక్రమ తవ్వకాలు జరిపారు. గత ఐదేళ్లలో ఇక్కడ మట్టి కొండలు మాయమయ్యాయి. పగలు, రాత్రి తేడా లేకుండా భారీ ఎత్తున గ్రావెల్ తరలించుకెళ్లారు. గతంలో పచ్చని తోటలతో కళకళలాడిన రామేశంపేట మెట్ట ప్రస్తుతం కళావిహీనంగా మారింది. 50 అడుగుల లోతుకు పైగా తవ్వడంతో, కుంటలుగా మారాయి. వర్షం నీరు చేరికతో చెరువులను తలపిస్తున్నాయి. పరిధికి మించి మట్టి తవ్వడంతో ఎర్రమట్టి కొండల మీదుగా వేసిన విద్యుత్ స్తంభాలు, టవర్లు గాలిలో వేలాడుతున్నాయి.
వైఎస్సార్సీపీ పాలనలో రెవెన్యూ, పోలీసు, గనులు, కాలుష్య నియంత్రణమండలికి చెందిన అధికారులు, నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గారు. నవరత్నాలు పేదలకు ఇళ్లు పథకంలో భాగంగా లే ఔట్ల మెరక పనులకు కొంత మట్టిని తరలిస్తే, ఆముసుగులో ఆపార్టీ నేతలు మరికొంత తరలించి సొమ్ము చేసుకున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 500 ఎకరాలపైనే మట్టి నిల్వలు కరిగించారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గనుల్లో ఎక్కడా మట్టి తవ్వకాలు జరగడం లేదని గనుల శాఖ చెబుతున్నా రామేశంపేటమెట్ట, గుండ్ల మెట్ట వద్ద తవ్వకాలు మాత్రం సాగిపోతున్నాయి. నిత్యం వాహనాలు బారులు తీరి క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించేస్తున్నాయి. మట్టి తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ పరిశీలించారు. గండేపల్లి, ప్రత్తిపాడు, రౌతులపూడి, మండలాల్లో అనుమతులు లేని క్వారీల్లో తవ్వకాలు జరుగుతున్నాయని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
"పర్మిట్లు ఉన్న క్వారీలతో పాటు, పర్మిట్లు లేని వాటిలో కూడా తవ్వకాలు జరుగుతున్నాయి అని మా దృష్టికి వచ్చింది. కొన్ని వాహనాలు సీజ్ చేశాము. పర్మిట్లు తాత్కాలికంగా నిలుపుదల చేశాము". - షాన్ మోహన్, కాకినాడ కలెక్టర్