Rare Surgery in King George Hospital at Visakhapatnam : కన్ను అత్యంత సున్నితమైన అవయవం. కంటికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేని పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటిది ఏకంగా కంట్లో కొయ్య దిగిన వ్యక్తికి మళ్లీ చూపు వస్తుందని ఊహించలేం. కానీ విశాఖ కేజీహెచ్ (KGH) వైద్యులు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. శస్త్రచికిత్స చేసి బాధిత వ్యక్తికి మళ్లీ చూపు ప్రసాదించారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం గురధరపాలేనికి చెందిన మీసాల నాగేశ్వరరావు ఈ నెల (జూన్) 4వ తేదీ రాత్రి తన ఇంటి మొదటి అంతస్తు నుంచి దిగుతూ కాలు జారి పడిపోయారు. అప్పుడు దాదాపు 12 అంగుళాల పొడవున్న సరుగుడు కొయ్య ఆయన కుడి కంటి నుంచి మెదడు కింది భాగంలోకి చొచ్చుకుపోయింది. ఆయనను పరీక్షించిన నర్సీపట్నం వైద్యులు ఐదో తేదీ ఉదయం KGHకు తీసుకొచ్చారు. అక్కడి కంటి వైద్య నిపుణులు, న్యూరో సర్జన్లు, ఎముకలు, ఈఎన్టీ, మత్తు విభాగాల వైద్యులు బృందంగా ఏర్పడి పరీక్షలు చేశారు.
శునకానికి అరుదైన హార్ట్ సర్జరీ- దిల్లీ వైద్యుల ఘనత- ఆసియాలో ఇదే మొదటిసారి - Dog Heart Surgery
King George Hospital Visakhapatnam : అదే రోజు ఉదయం 11 గంటల సమయంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి కొయ్యను తొలగించారు. వారం రోజుల పాటు చికిత్స అందించడంతో బాధితుడు కోలుకున్నారు. కన్ను, కంటి నరాలు, మెదడు కింద ఉన్న రక్త నాళాలకు నష్టం జరగకుండా శస్త్రచికిత్స సమయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితంగా కంటి చూపు మళ్లీ వచ్చింది. కంటి నుంచి మెదడు నరాల్లోకి వెళ్లిన కొయ్యను తొలగించిన తరవాత కంటి చూపు రావడం గొప్ప విశేషమని వైద్యులు చెప్తున్నారు.
ఇలాంటి శస్త్ర చికిత్సలు అరుదుగా జరుగుతాయని, పలు విభాగాల వైద్యులు కలిసి చేయడంతో ఇది విజయవంతమైందని KGH (King George Hospital) సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద తెలిపారు. శస్త్రచికిత్సలో పాల్గొన్న డాక్టర్ కల్యాణి, డాక్టర్ దక్షిణామూర్తి, డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ హయగ్రీవరావు, డాక్టర్ రవి, డాక్టర్ శ్రీలక్ష్మి బృందాన్ని ఆయన అభినందించారు.