Media Mogul Ramoji Rao GrandSon Sujay Interview : మీడియా మొఘల్, దిగ్గజ వ్యాపారవేత్త క్రమశిక్షణకు మారుపేరు. ఇది రామోజీరావు గురించి ప్రపంచానికి తెలిసిన కోణం. అల్లరి భరించారు. బుజ్జగించారు. కథలు చెప్పారు. విలువల్నీ, జీవితపాఠాల్నీ నేర్పించారు. ఇవీ ఆయన మనవరాళ్లకు, మనవడికి మాత్రమే తెలిసిన విషయాలు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే వారసులు సహరి, బృహతి, కీర్తి సోహన, సుజయ్, దివిజ. వారిలో ఒకరైన సుజయ్ ఈటీవీ భారత్ - ఈనాడుతో తమ అనుభవాలు పంచుకున్నారు.
తాతగారి గురించి ఎంత చెప్పినా మాటలు సరిపోవు. ఏ పని చేసినా నిష్కల్మషంగా చేసేవారు. అహం అనేది చంపుకొంటే చాలు జీవితంలో మనకు తిరుగు ఉండదనే విషయం ఆయన్నుంచే నేర్చుకున్నా. తాతగారు ఎంత మంచి చేస్తున్నా ఎందుకు ఇంతమంది రకరకాలుగా అనుకుంటున్నారో చిన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. ఓ సారి ఆ విషయాన్ని వారినే అడిగా. అది మానవ సహజం. ఎవరేం అనుకున్నా పక్కనపెట్టు. నువ్వు దాన్నెలా తీసుకుంటున్నావనేదే ముఖ్యం అనేవారు. ‘నాకు జీవితం చాలా నేర్పించింది. వైఫల్యాలను చూసి ఎప్పుడూ బెంబేలెత్తిపోలేదు. అవకాశంగా మలుచుకున్నా. నీ బాధ్యతలు నువ్వు తెలుసుకుని అందరికీ బలం అవ్వాల’నేవారు. రామోజీరావుగారి మనవడు సుజయ్ అని కాకుండా సుజయ్ తాత రామోజీరావని చెప్పుకొనేలా ఎదగమనే గోల్ నాకిచ్చారు. ఈ విషయమై చాలా సార్లు నా దగ్గర ప్రామిస్ కూడా తీసుకున్నారు. నాకు, అక్కలకీ, చెల్లికీ ఆయన పంపిన లేఖలు, ఈమెయిల్స్‌ని ‘తాతయ్య సందేశం’గా పుస్తకాన్ని వేయించి ఇచ్చారు. దాన్నే మార్గదర్శకంగా తీసుకుని భవిష్యత్తుని నిర్మించుకోమన్నారు.
ఎంత గారాబం చేసినా పొరబాట్లు చేస్తే చీవాట్లు తప్పేవి కాదు. తిట్టారని బాధపడుతుంటే ‘లేకపోతే నీకు భజన చేయమంటావా? నీ లోపాలను చెప్పి సరిదిద్దాలి కానీ, నీకు భజన చేస్తే నీకే నష్టం జరుగుతుంది. చెప్పు భజన చేయమంటే చేస్తా. వినకపోతే తరవాత తెలుసుకుంటాడు లే అని ఆశపడతాను. జరగకపోతే బాధపడతాను’ అంటూ ఏదో రకంగా నచ్చచెప్పేవారు. చిన్నప్పుడు అమ్మ ‘తాతగారి దగ్గరకి వెళ్లి కూర్చో ఆయన చెప్పేది అర్థం చేసుకో’మనేది. నేను మాత్రం టీవీ చూడాలని, వీడియోగేమ్‌లు ఆడాలనుకునేవాడిని. దాన్ని తాతయ్య పసిగట్టేసేవారు.
దేహ్రాదూన్‌లో చదివేవాడిని. నువ్వా స్కూల్‌ని బాగా ఉపయోగించుకుంటున్నట్లు నాకేమీ అనిపించడం లేదన్నారోసారి. వెంటనే నేను ‘తాతగారూ క్షమించండి. అక్కడికి వెళ్లకపోతే మీరు నన్ను చూసి అభినందించే మార్పు ఎప్పటికీ వచ్చుండేది కాదు’ అనేశా. దాంతో నిజమే నేనొప్పుకొంటా అన్నారు. తాతగారు నాతో ఎన్నో కబుర్లు చెప్పేవారు. చిన్నప్పటి రోజుల్లో జరిగిన సంఘటనల్ని పంచుకునేవారు. ఆయన పదో తరగతి పాసవ్వడానికి రోజూ కామాక్షమ్మకు మూడు కొబ్బరికాయలు కొట్టిన విషయం, స్నేహితుడు రమణారావుతో చేసిన అల్లరి ఇలా చాలానే ఉన్నాయి. చిన్నప్పుడు తెలుగు నేర్చుకునే విషయంలో తాతగారికీ నాకూ మధ్య ఓ సరదా పందెం ఉండేది. నేను ఏవైనా ఆంగ్ల పదాలు మాట్లాడితే ఆయనకి నేను ఐదు రూపాయలివ్వాలి. లేదంటే ఆయనే నాకు పది రూపాయలు ఇవ్వాలి. అలా చాలా తెలుగుపదాలు నేర్చుకున్నా.
పరీక్షలు పూర్తి చేసుకుని అమెరికా నుంచి తిరిగి వచ్చేనాటికి చదివేందుకు 300 పుస్తకాలను సిద్ధం చేసి పెట్టారు తాతగారు. ప్రతి ఒక్కదాన్నీ చదివి ఏ పరిస్థితుల్లో ఉపయోగపడుతుందో, ఏ సందర్భంలో ఏది వర్తించదో చెబుతూ వాటికి స్టార్ రేటింగ్ కూడా ఇచ్చారట. ఆయన సూచించిన పుస్తకాల్లో ‘హౌటూ విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్స్ పీపుల్’ అనే డేల్ కార్నెగీ రచన ఒకటి. నిజానికి తాతగారు ఇంత త్వరగా దూరమవుతారని అస్సలు అనుకోలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ఆయనకి ఫోన్ చేశా. ఎంతో సంతోషంగా ఉన్నారు. ‘పోతూ పోతూ ఐదు కోట్ల మందికి ఉపయోగపడగలిగా చాలు’ అన్నారు. ఆయన వెళ్లిపోయినా కన్నీటి బొట్టు కార్చకూడదని, ఎంత కష్టంలోనూ ఏడవకూడదని చెప్పారు. తాతగారు మాకిచ్చిన లక్ష్యాలను, బాధ్యతలను నెరవేర్చడంతో పాటు సొంతంగా నేను కొన్ని వెంచర్స్ ప్రారంభించాలన్న ఆయన కోరికను నెరవేర్చడానికి నిరంతరం శ్రమిస్తా.