Rakesh of Vijayawada Body Builder Aims Gold in Mr Asia Contest : సన్నగా ఉన్నావని అందరూ అవహేళన చేయడంతో ఆ యువకుడిలో పట్టుదల పెరిగింది. బరువు పెంచాలని జిమ్‌లో చేరి అహర్నిశలు శ్రమించాడు. ఎంచుకున్న దారిలోనే ఎదుగుతూ విజయ తీరాలు చేరాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. రాష్ట్ర, జాతీయస్థాయిలో పసిడి పతకాలు సాధించి సత్తా చాటాడు. మిస్టర్ ఆసియా పోటీలో గెలుపొందడమే లక్ష్యమంటున్న విజయవాడకు చెందిన యువ బాడీ బిల్డర్ రాకేష్ కథ తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
ఏ రంగంలోనైనా పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులనైనా దాటవచ్చని నిరూపిస్తున్నాడు ఈ యువకుడు. చిన్నతనంలో బాడీ బిల్డింగ్‌పై ఉన్న ఆసక్తినే లక్ష్యంగా మార్చుకున్నాడు. కష్టానికి ఫలితంగా వరసగా 9 సార్లు మిస్టర్ ఆంధ్రా, ఒకసారి మిస్టర్ ఇండియా టైటిల్స్ సాధించి ప్రతిభ చాటాడు. తనని అవహేళన చేసిన వారితోనే ఔరా అనిపిస్తున్నాడు ఈ యువ బాడీ బిల్డర్.
కసరత్తుల చేస్తున్న యువకుని పేరు రాకేష్. విజయవాడకు చెందిన బోళ్ల రామారావు, ఇందుమతి దంపతుల కుమారుడు. తండ్రి ఓ ప్రైవేట్ కంపెనీలో గుమస్తాగా పని చేస్తున్నారు. డిగ్రీ చదువుకునే రోజుల్లో సన్నగా ఉన్న రాకేష్‌ని చూసి బంధువులు, మిత్రులు ఎగతాళి చేసేవారు. ఆ మాటలకు కుంగిపోకుండా వాటినే ఎదుగుదలకు మెట్లుగా మలుచుకున్నాడు.
బరువు పెరగాలని 2010లో రాకేష్ జిమ్‌లో చేరాడు. కోచ్ తన పట్టుదల చూసి బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనాలని ప్రోత్సహించాడు. దాంతో ప్రతికూల పరిస్థితులు సైతం అధిగమించి బాడీ బిల్డింగ్‌లో రాణిస్తున్నాడు.
రాష్ట్ర, జాతీయస్థాయిలో పతకాలు సాధిస్తూ సత్తా చాటుతున్నాడు రాకేష్. పోటీ చేసిన ప్రతీ చోటా పతకాలు కైవసం చేసుకుంటూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. బాడీ బిల్డింగ్‌లో రాణించాలంటే ఖర్చుతో కూడుకున్నది అందుకోసం ఓ జిమ్‌లో శిక్షణ ఇస్తూ సంపాదించుకున్నాడు రాకేష్.
'రోజుకు 6-7 గంటలు కసరత్తులు చేస్తూ పోటీల్లో రాణించాను. పోటీలు ఉన్నప్పుడు ఆహారం పట్ల కఠినంగా వ్యవహరిస్తాను. తప్పనిసరిగా శిక్షకుని సంరక్షణలోనే బాడీ బిల్డింగ్ చేయాలి. స్వయంగా కసరత్తులు చేసే సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది.' -రాకేష్, యువ బాడీ బిల్డర్
8 ఏళ్ల పాటు జిమ్‌లో శిక్షకుడిగా ఉన్న రాకేష్ 2018లో సొంత జిమ్ స్థాపించాడు. బాడీ బిల్డింగ్‌లో రావాలని ఉన్నా.. ఆర్థిక ఇబ్బందులతో రాలేకపోతున్న వారిని దృష్టిలో ఉంచుకుని తక్కువ రుసుముతో శిక్షణ ఇస్తున్నాడు. తమలాంటి వారిని ప్రభుత్వం గుర్తించి ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నాడు.
రాకేష్ తమను ఎంతో ప్రోత్సహిస్తాడని అంటున్నారు. జిమ్‌లో శిక్షణ పొందే యువకులు. విజయవాడలో చాలామంది బౌన్సర్లను తయారు చేశాడని చెబుతున్నారు. మధ్యతరగతి కుటుంబం కావడంతో రాకేష్ తమపైనే పూర్తిగా ఆధారపడలేదని చెబుతు న్నారు తల్లిదండ్రులు. శిక్షకుడిగా చేస్తూ వచ్చే సంపాదనతో ఇంట్లో కొంత డబ్బులు ఇవ్వడంతో పాటు పోటీల్లో పాల్గొనేందుకు మిగిలింది ఖర్చు చేసుకునేవాడని తెలిపారు. మిస్టర్ ఆసియా పోటీల్లో గెలుపొంది టైటిల్ సాధించాలనేదే లక్ష్యం అంటున్నాడు యువ బాడీ బిల్డర్.