Rain in Hyderabad : తెలంగాణలో ఒకవైపు భానుడు భగభగమంటున్న తరుణంలో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇవాళ హైదరాబాద్‌తో పాటు పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో వర్షం పడగా కామారెడ్డి జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ముంచెత్తింది. జిల్లాలోని రామారెడ్డి, మాచారెడ్డి మండలాల్లో భారీ వర్షం పడగా కుట్టకింది తండాలో ఈదురుగాలుల ధాటికి ఇంటి రేకులు ఎగిరిపడ్డాయి.
తడిసిన ధాన్యం : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ మండలాల వ్యాప్తంగా తీవ్రమైన ఈదురుగాలతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. బలమైన ఈదురు గాలులు వీయడంతో అధికారులు విద్యుత్‌ను నిలిపివేశారు.
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో పలుచోట్ల మామిడికాయలు నేలరాలాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం బస్తాలు, ధాన్యం తడిసి ముద్దయింది. బస్వాపూర్‌లో పశువుల పాక కూలి రెండు గేదెలకు తీవ్ర గాయాలయ్యాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
మరోవైపు రాష్ట్రంలో రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేణ 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడురోజుల్లో కూడా కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు వస్తాయని వాతావరణ కేంద్రం వివరించింది.
గుడ్ న్యూస్- ఈసారి నైరుతి రుతుపవనాలకు అన్నీ గ్రీన్ సిగ్నల్స్! - monsoon forecast 2024 india