Purandeshwari Video Conference on Counting Process: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం మహాకూటమికే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు విశ్లేషణలు తేటతెల్లం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (BJP State President Daggubati Purandheswari) తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని నాయకులకు సూచించారు.
కౌంటింగ్ ఏజెంట్లు ఇతర అంశాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ 500 ఓట్లకు ఒక్కో టేబుల్ ఏర్పాటు చేయాలని ఈ విషయంలో అధికారులతో మాట్లాడి స్పష్టత ఇవ్వాలని అన్నారు. ఎన్నికల సమయంలో కష్టించి పని చేసిన కార్యకర్తలు ఇళ్లకు వెళ్లి కృతజ్ఞతలు తెలపాలని అన్నారు. ఎన్నికల సమయంలో కూటమిలో ఉన్న పార్టీలు ఎంత సమన్వయంతో పని చేశాయో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కూడా అంతకంటే ఎక్కువగా కలిసి సమన్వయంతో పని చేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో విస్తారక్‌లు చేసిన కృషిని పురందేశ్వరి ప్రస్తావించారు.
TDP Leader Pemmasani Sriratna: జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓట్ల కౌంటింగ్‌కు హాజరయ్యే ఏజెంట్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్ (TDP candidate Pemmasani Chandrasekhar) సతీమణి శ్రీరత్న ఓ వీడియో రూపొందించారు. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు విధానంతో ఏజెంట్లు అనుసరించాల్సిన విధివిధాలను ఆమె ఈ వీడియోలో వివరించారు. ఎన్‌డీఏ కూటమి తరపున పోటి చేస్తున్న అభ్యర్ధులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లందరూ ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.