DJs Selling Drugs in Hyderabad Pubs : హైదరాబాద్‌లోని కొన్ని పబ్బులు డ్రగ్స్ సరఫరాదారులు, వినియోగదారులకు కేంద్రంగా మారుతున్నాయి. మద్యం మత్తులో సంగీతాన్ని ఆస్వాదించేందుకు ఏర్పాటు చేస్తున్న పబ్బులు, మాదకద్రవ్యాల దందాకు కేంద్ర బిందువుగా తయారయ్యాయి. కొంతకాలంగా మత్తు పదార్థాల వినియోగదారులు, డ్రగ్ పెడ్లర్లు తరచూ పబ్బుల్లో చిక్కుతున్నారు. పబ్బులను కేంద్రంగా చేసుకోని అమ్మకాలు జరుగుతుండటం వివాదాస్పదమవుతోంది.
తాజాగా ఖాజాగూడలోని ది కేవ్ పబ్‌లో డ్రగ్స్, గంజాయి తీసుకునేవారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా పార్టీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారిలో డ్రగ్స్ వాడిన 24 మంది చిక్కడం గమనార్హం. 20 రోజుల క్రితం మాదాపూర్‌లోని పబ్బులో ఓ డీజే మాదకద్రవ్యాలు తీసుకుని పోలీసులకు దొరికిపోయాడు. గత మూడు వారాల్లో నమోదైన రెండు డ్రగ్స్ కేసులు కూడా పబ్స్ కేంద్రంగా ఉండటం ఈ పరిస్థితిని తెలుపుతుంది.
డీజేలదే ప్రధాన పాత్ర పబ్బుల్లో పనిచేసే డీజేలు ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు టీజీన్యాబ్ పోలీసులు గుర్తించారు. నగరంలో వందకుపైగా పబ్బులు ఉన్నాయి. దీంతో డీజేలకు విపరీతంగా డిమాండ్ ఉంది. వేర్వేరు రాష్ట్రాల్లో పనిచేసే డీజేలకు పబ్బుల యజమానులతో పాటు దేశవ్యాప్తంగా ఈవెంట్ ఆర్గనైజర్లతో డ్రగ్స్ సరఫరా ముఠాలు, నైజీరీయన్లతో సంబంధాలు నెరుపుతున్నారు. ఈవెంట్లకు వేర్వేరు నగరాలకు తరచూ వెళ్లే డీజేల్లో కొందరు పబ్బుల్లో పరిచయమయ్యేవారికి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నారు.
ఈ శనివారం అర్ధరాత్రి ది కేవ్ పబ్‌లో, జూన్ 16న మాదాపూర్‌లోని ఒక పబ్‌లో డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా ముగ్గురు డీజేలు పట్టుబడ్డారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని ఐదు పబ్బుల్లో డీజేలుగా పనిచేస్తున్న ఇద్దరు బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నట్లు టీజీన్యాబ్ పోలీసులు గుర్తించారు. పబ్బుల నిర్వాహకులు, యజమానులు అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. మామూళ్లకు అలవాటుపడ్డ కొందరు పోలీసుల నిర్లక్ష్యంతోనే వారి ఆగడాలను అరికట్టడం లేదంటూ విమర్శలున్నాయి.
హైదరాబాద్: పబ్‌కు వెళ్లిన ఆ 24 మంది ఇలా దొరికిపోయారు
కొన్ని ఉదాహరణలు...
- ఫిబ్రవరి మొదటి వారం టీజీ న్యాబ్ పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్న ఆరుగుర్ని అరెస్టు చేశారు. నిందితులు గోవా, బెంగళూరు సహా వివిధ నగరాల నుంచి తీసుకొచ్చి పబ్బుల్లో డ్రగ్స్ విక్రయిస్తున్నారు.
- మార్చి నెలలో హైదరాబాద్ పోలీసులు రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసులో కొందరిని అరెస్టుచేశారు. డ్రగ్స్ ఎలా వచ్చాయని పోలీసులు ఆరాతీస్తే, అబ్దుల్ రెహ్మాన్ అనే వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ఇతడు ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకుని నగరంలోని పబ్బులవద్ద డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.
పబ్ నిర్వాహకులు దొరికితే గుట్టురట్టు : ఖాజాగూడలో ది కేవ్ పబ్‌లో శనివారం అర్ధరాత్రి జరిగిన సైకిడెలిక్ పార్టీకి 24 మంది డ్రగ్స్ తీసుకుని హాజరైన కేసులో పరారీలో ఉన్న నలుగురు పబ్ నిర్వాహకుల కోసం రాయదుర్గం పోలీసులు గాలిస్తున్నారు. రాజేశ్, అభినవ్, సాయికృష్ణ, సన్నీలను అదుపులోకి తీసుకుంటే, పబ్‌లో ఎన్నాళ్ల నుంచి ఈ తరహా వ్యవహారాలు కొనసాగుతున్నాయనే విషయాలువెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాగా, ది కేవ్ పబ్ కేసులో బెంగళూరు నుంచి వచ్చిన ఓ డీజేనే కొందరికి డ్రగ్స్ ఇచ్చారనే విషయంపైనా విచారణ సాగుతోంది.