Public Problem Solving Platform Will Start From Today In AP : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మళ్లీ ప్రారంభమైంది. గతంలో స్పందన పేరుతో పిలిచే ఈ కార్యక్రమానికి ప్రజా సమస్యల పరిష్కార వేదికగా కొత్త ప్రభుత్వం పేరు మార్చింది. మరింత జవాబుదారీతనంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఫిర్యాదులు పదేపదే పునరావృతం కాకుండా ప్రణాళికాతో పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఫిర్యాదులు చేశారు.
ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రారంభం కాగా జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు ఇందులో పాల్గొన్నారు. మళ్లీ ప్రారంభమైన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ప్రజలు హాజరై తమ వినతులను ఇన్ ఛార్జ్ కలెక్టర్‌కు సమర్పించారు. వ్యక్తిగత సమస్యలతోపాటు సామాజిక సమస్యలు కూడా ఇందులో ఉన్నాయి.
Initiation of Platform Program for Solving Public Problems : కర్నూలు కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున బాధితులు తమ సమస్యలను అధికారులకు విన్నవించుకున్నారు. జాయింట్ కలెక్టర్ మౌర్య వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని జేసీ తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లా కలెక్టరేట్లలో ప్రజా సమస్యల స్వీకరణ ప్రారంభమైంది. గత ప్రభుత్వంలో పింఛన్‌కు నోచుకోని అనేక మంది దివ్యాంగులు ఫిర్యాదులు చేశారు.
Public Grievance Redressal System in Vizianagaram : విజయనగరం, మన్యం జిల్లాలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. సమస్యల పరిష్కారం కోరుతూ అధికారులకు వినతులు అందచేశారు. మరోవైపు, మన్యం జిల్లా కురుపాం మండలం తొలంగూడ గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని కలెక్టరేట్ వద్ద గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందచేశారు.
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను అధికారులు ప్రారంభించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో ప్రజల ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. ఫిర్యాదులు ఇచ్చేందుకు జిల్లా నలుమూలల నుంచి జనం భారీగా తరలివచ్చారు.