Public Facing Problems With Damaged Roads : విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో మంజూరు చేసిన 21 రహదారులకు గత ప్రభుత్వం రూ.58 కోట్లు కేటాయించింది. మొదట్లో రాజకీయ నాయకులు, అధికారులు హడావుడిగా శంకుస్థాపనలు చేశారు. గుత్తేదారులూ పనులు ప్రారంభించారు. ఇంకేముంది రహదారుల రూపురేఖలు మారనున్నాయని ప్రయాణ కష్టాలు తీరుతాయని బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు ఆశించారు. కానీ, పనులు 20 శాతం పూర్తయ్యాక గుత్తేదారులకు బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు. అప్పటి నుంచి స్థానికులకు ఇబ్బందులు రెట్టింపయ్యాయి. పనులు మధ్యలో వదిలేయటంతో రాళ్లు తేలిపోయాయి. ప్రస్తుత వర్షాలకు గోతుల్లో నీరు చేయటంతో రాకపోకలకు ఇక్కట్లు తప్పటం లేదు.
గత ప్రభుత్వం కనీసం గుంతలు కూడా పూడ్చలేదు- వెంటనే టెండర్లు పిలవండి: చంద్రబాబు
అస్తవ్యస్తంగా మారిన రోడ్లు : బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఏపిఆర్ఆర్పి పథకం ద్వారా చేపట్టిన పనుల్లో తెర్లాం మండలంలో రెండు రహదారులు మినహా మరేవీ పూర్తి కాలేదు. బొబ్బిలి మండలం డొంగురువలస మీదుగా సాలూరు మండలం చినబోరబంద వరకు రూ.7 కోట్లతో నిర్మించాల్సిన తారు రోడ్డు పనులు జరగలేదు. వేసిన రాళ్లు తేలిపోయాయి. వర్షాలకు రహదారిపై నీరు నిలిచిపోవటంతో బొబ్బిలి, సాలూరు, రామభద్రపురం మండలాల గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అన్నంనాయుడువలస, కారాడ, చిననందబలగ, కోమటిపల్లి నుంచి కుమందానపేట, కింతలవానిపేట, ఎం.బూర్జివలస నుంచి చెల్లారపువలస తదితర రహదారుల పనులు సగంలో ఆగిపోయాయి. దీంతో ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"బొబ్బిలి పట్టణంలోని రహదారులు అధ్వానంగా ఉన్నాయి. మూడు రోజులుగా అడపదడపా కురుస్తున్న వర్షాలకు ప్రధాన రోడ్లు గోతులమయంగా మారాయి. గత ప్రభుత్వ పాలనలో వీటి మరమ్మతులకు చర్యలు చేపట్టలేదు. దీంతో పట్టణ పరిధిలో ప్రయాణం నరకప్రాయంగా మారింది." - స్థానికులు
"రహదారుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాము. బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఏపి.ఆర్.ఆర్.పి పథకం ద్వారా చేపట్టిన వాటిలో మిగిలిపోయిన పనులు,పెడింగ్ బిల్లుల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాము.ఇక బొబ్బిలి పట్టణ పరిధిలోని రహదారుల బాగుకు శాశ్వత పనుల కోసం రూ.8 కోట్లతో నివేదిక ప్రతిపాదించాము." - రామలక్ష్మి, మున్సిపల్ కమిషనర్
రహదారులపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పటంలేదు. కూటమి ప్రభుత్వం రోడ్ల సమస్యపై దృష్టి పెట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు.
రహదారుల నిర్మాణానికి కేంద్ర సాయం మరింత కోరుదాం: డిప్యూటీ సీఎం పవన్ - Pawan Kalyan on Rural Roads