Family Politics in YSRCP : 'అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా?' కొందరు వైఎస్సార్సీపీ అభ్యర్థులను చూశాక ప్రజల ప్రశ్న ఇది! సీఎం జగన్ మొదలుృ ఆ పార్టీలోని పలువురు అభ్యర్థులను ఇంటిపోరు వేధిస్తోంది. ఆ పంచాయితీ 'నీచుడు, దుర్మార్గుడు' అని తిట్ల దండకం మొదలు 'మా అన్నను ఓడించండి' అని బహిరంగంగానే పిలుపునిచ్చే స్థాయిలో ఉంది. అయినవారి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నవారిలో జగనే ముందున్నారు.
ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అరాచకాలపై ఆయన మేనల్లుడు రమేశ్‌బాబు బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఆయన మోసం చేశారని రమేశ్ వైఎస్సార్సీపీని వీడి కాంగ్రెస్‌లో చేరి అదే నియోజకవర్గంలో బరిలోకి దిగారు. వైసీపీలో కొనసాగుతున్నప్పుడే నారాయణస్వామిని బహిరంగంగా విమర్శించారు. నారాయణస్వామి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కాళ్లు పట్టుకునే పదవులు పొందారని తర్వాత జగన్ కాళ్లు పట్టుకొనే ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి అయ్యారని ఆరోపించారు. 'నియోజకవర్గాన్ని ముక్కలుగా చేసిన చీడపురుగు మా మామ’ అని నారాయణస్వామి వ్యవహారాలను ప్రస్తావిస్తున్నారు.
అంబటి రాంబాబు : సత్తెనపల్లిలో వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మంత్రి అంబటి రాంబాబు అరాచకాలపై ఆయన రెండో అల్లుడు డాక్టర్ గౌతమ్ వీడియో సందేశాల ద్వారా వివరిస్తున్నారు. అంబటిలాంటి వారికి ఓట్లు వేయవద్దని విజ్ఞప్తి చేశారు.
బూడి ముత్యాలనాయుడు మోసం : ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మోసం చేశారని ఆయన కుమారుడు రవికుమార్ రోడ్డెక్కారు. తన తల్లి, అక్కనూ పట్టించుకోలేదంటూ బూడి గతంలో ప్రాతినిధ్యం వహించిన మాడుగులలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. సొంతంగా ప్రచారం చేసుకుంటూ తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. ప్రస్తుతం ముత్యాలనాయుడు అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తూ, తన రెండో భార్య కుమార్తెకు మాడుగుల అసెంబ్లీ టికెట్ ఇప్పించుకున్నారు.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ : టెక్కలి వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్యాయం చేశారని ఆయన భార్య వాణి ఏకంగా సీఎం జగన్ వద్దే పంచాయితీ పెట్టారు. దీంతో అప్పటి వరకూ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న శ్రీనివాస్‌ను తప్పించి ఆ బాధ్యతను వాణికి అప్పగించారు. చివరికి టికెట్ శ్రీనివాస్‌కే ఇచ్చారు. ఆగ్రహించిన వాణి స్వతంత్రంగా బరిలోకి దిగేందుకు చూడగా వైసీపీ నేతలు నచ్చజెప్పే యత్నం చేశారు. ఆ క్రమంలోనే శ్రీనివాస్ కొన్ని ఆస్తులను వాణి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని తెలిసింది. కానీ, తమను మోసం చేశారని వాణి, ఆమె తండ్రి రాఘవరావు శ్రీనివాస్‌తో కలవడం లేదు. రాఘవరావుకు 1983 నుంచి టెక్కలిలో రాజకీయంగా పట్టు ఉండటంతో వీరిని తనవైపు తిప్పుకొనేందుకు శ్రీనివాస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
ముద్రగడ పద్మనాభం : వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పిఠాపురంలో వైసీపీ ఎన్నికల బాధ్యత నిర్వర్తిస్తున్నారు. అక్కడ పోటీలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్‌పై విమర్శలు చేస్తున్నారు. వాటిని ముద్రగడ కుమార్తె క్రాంతి ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు.
జగన్ : ‘అమ్మతోడు మా కుటుంబాన్ని చీల్చింది జగనన్నే. అందుకు సాక్ష్యం దేవుడు, నా తల్లి విజయమ్మే’ అని జగన్ సోదరి, ఏపీపీసీ అధ్యక్షురాలు షర్మిల కుండబద్దలు కొట్టారు. జగన్ స్వార్థం కోసం కన్నతండ్రి పేరునూ సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్పించారని ఆక్షేపించారు. వివేకానందరెడ్డి హత్యపైనా జగన్ వైఖరిపై ప్రశ్నల వర్షం కురిపించారు. హంతకులు పాలకులుగా ఉండొద్దంటూ జగన్ మరో సోదరి, సునీత వివేకా హత్య కేసుపై పోరాడుతున్నారు. కేసులో అసలు నిందితులను జగన్ కాపాడుతున్నారంటూ, జగన్ వల్ల తన కుటుంబానికి అన్యాయం జరిగిందంటూ ప్రజల్లోకెళ్లి వివరిస్తున్నారు. వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ కూడా జగన్... తమ కుటుంబాన్ని మోసం చేశారంటున్నారు.