Protest to Change the Name to NTR Health University: ఐదేళ్ల జగన్ పాలనలో అకృత్యాలు, దౌర్జన్యాలతో విసిగిపోయిన ప్రజలు వైఎస్సార్సీపీకి గట్టి గుణపాఠం చెప్పారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క సీటూ వైఎస్సార్సీపీకి కట్టబెట్టకుండా తుడిచిపెట్టేశారు. ఎన్టీఆర్ వర్శిటీ లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు, భవనాలకు గతంలో ఉన్న మహనీయుల పేర్లను తొలగించడంపై అప్పట్లోనే ప్రజాగ్రహం పెల్లుబికింది. అయినా లెక్కచేయకుండా నియంతపోకడలతో విచ్చలవిడిగా వైఎస్సార్సీపీ సర్కార్ చెలరేగిపోయింది. ప్రస్తుతం జగన్ గద్దె దిగడంతో మార్చిన పేర్లను వెంటనే తొలగించాలంటూ ప్రజలు, ఆయా సంస్థల్లో పనిచేసే సిబ్బంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ లేఖలు రాస్తున్నారు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యేక చొరవ తీసుకుని దేశంలోనే మొదటి ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని1986లో విజయవాడలో నెలకొల్పారు. ఎన్టీఆర్ మరణించిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1999లో ఎన్టీఆర్ పేరునే ఆ విశ్వవిద్యాలయానికి పెట్టారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఆ పేరును మార్చేయడంతో ప్రజలు, ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా రగిలిపోయారు. దాని ఫలితమే కూటమికి ప్రజలు పట్టంకట్టిన మరుక్షణమే విశ్వవిద్యాలయానికి పెద్దఎత్తున చేరుకుని వైఎస్‌ఆర్ పేరును తొలగించారు.
ఏపీ నుంచి కేంద్ర మంత్రులుగా ముగ్గురు ప్రమాణస్వీకారం - Union Ministers From AP
ఆ స్థానంలో తిరిగి ఎన్టీఆర్ పేరును పెట్టారు. తాజాగా ఎన్టీఆర్ వర్శిటీలో పనిచేసే సిబ్బంది కొత్త ప్రభుత్వానికి ఓ లేఖను పంపించారు. గత ప్రభుత్వం చేసిన పేరు మార్పు సరికాదని, వెంటనే డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంగా మారుస్తూ ఆదేశాలు జారీ చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో వర్శిటీని పూర్తిగా నిర్వీర్యం చేయడమే కాకుండా దశాబ్దాలుగా కూడబెట్టిన నిధులను ఎత్తుకుపోయారంటూ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
38 ఏళ్లుగా ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎలాంటి ఆటుపోట్లు లేకుండా నడిచింది. కానీ జగన్ ప్రభుత్వం ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు చేయకపోవడంతో వర్సిటీలో అభివృద్ధి కుంటుపడిందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్శిటీకి చెందిన 400 కోట్లు వెనక్కి తీసుకురావడం సహా ఉద్యోగుల సంక్షేమం కోసం చేపట్టాల్సిన నిర్ణయాలపై ప్రభుత్వాన్ని కలిసి విన్నవిస్తామని నాన్ టీచింగ్ అసోసియేషన్ నేతలు స్పష్టం చేశారు. వైఎస్సార్ పేరును తొలగించాలని డిమాండ్ చేస్తూ తెలుగు యువత నేతలు వర్శిటీ ముందు ఆందోళన చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి వర్శిటీ వద్ద వైఎస్సార్ అక్షరాలను తొలగించి ఎన్టీఆర్ అనే అక్షరాలను ఏర్పాటు చేశారు.