Real Estate Regulatory Authority : ప్లాటు, ఫ్లాటు ఇంకా గేటెడ్ కమ్యూనిటీలో విల్లా అయినా, వాణిజ్య భవనంలో షట్టర్లు అయినా సరే వీటిలో ఏదైనా కొనుగోలు చేస్తున్నారా? అయితే, ఆయా స్థలం భవనం, నిర్మాణ అనుమతుల దగ్గర్నుంచి, బిల్డర్ల చరిత్ర వరకు గమనించాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్ సెంటిమెంట్, నమ్మకం మీద సాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఇటీవల కొత్తగా వచ్చిన వారు అక్రమ మార్గాలు ఎన్నుకుంటున్నారు.
కొందరు నిజాయతీగా ప్రాజెక్టులను పూర్తిచేసి అప్పగిస్తుంటే మరికొందరు అడ్వాన్స్ రూపంలో డబ్బులు తీసుకుని సకాలంలో పూర్తి చేయలేక సతాయిస్తున్నారు. 'ఇదిగో అదిగో' అంటూ తిప్పించుకుంటూ కస్టమర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు ముందస్తుగానే పలు జాగ్రత్తలు తీసుకుంటే చేదు అనుభవాల బారి నుంచి తప్పించుకోవచ్చు.
రెరాలో రిజిస్ట్రేషన్ జరిగిందా?
స్థిరాస్తి కొనేటప్పుడు సదరు రెరా (Real Estate Regulatory Authority - RERA)లో నమోదై ఉందో లేదో చూసుకోవాలి. రెరా రిజిస్ట్రేషన్ నెంబరు వచ్చినట్లయితే అన్ని అనుమతులు ఉన్నట్లుగా భావించాలి. స్థానిక సంస్థలు, సంబంధిత అథారిటీల నుంచి అనుమతులు పరిశీలించిన తర్వాతనే రెరా నమోదు చేస్తుందని తెలుసుకోవాలి. రెరాలో రిజిస్టర్ కాని ప్రాజెక్ట్‌లను కొని ఇబ్బందుల్లో పడొద్దు. ఇదిలా ఉంటే కొనుగోలుదారులు ఫిర్యాదు చేస్తే రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్ట్‌లకు రెరా భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తోంది.
హైదరాబాద్‌లో భూమి ధర అక్కడే ఎక్కువ - జూబ్లీహిల్స్, గచ్చిబౌలి కాదు - High land cost in Hyderabad
గత చరిత్ర చూడాల్సిందే..
ఒప్పందం ప్రకారం కాకుండా నిర్మాణం ఆలస్యం కావడం, పనులను మధ్యలోనే వదిలేయడం లాంటి సమస్యలతో పాటు సదుపాయాల కల్పనలో కొన్నింటిని విస్మరించడం వంటి అంశాలపై రెరాకు ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలో కొనే ముందుగా ఆయా సంస్థలు, బిల్డర్ల చరిత్రను పరిశీలించడం తప్పనిసరి. మీ కంటే ముందుగా ఆ ప్రాజెక్ట్‌ల్లో కొన్నవారి అభిప్రాయాలను తీసుకోవడం, ఆన్‌లైన్‌లోనూ రేటింగ్స్ గమనించిన తర్వాతే కొనొచ్చా లేదా అనే నిర్ణయం తీసుకోవడం మంచిది.
కట్టే సామర్థ్యం ఉందా?
రియల్ ఎస్టేట్‌లో లే అవుట్లు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు ఏవైనా సరే పూర్తి చేసే ఆర్థిక సామర్థ్యం ఆ సంస్థకు ఉందా? లేదా అనే విషయాలు పరిశీలించారు. ఇటీవల ఆర్థిక బలం లేని కొన్ని సంస్థలకు రెరా రిజిస్ట్రేషన్ తిరస్కరించడం తెలిసిందే. నాలుగేళ్ల కిందట ప్రీలాంచ్‌లో బుక్ చేసినా ఇప్పటికీ నిర్మాణం చేపట్టని సంస్థలపై రెరాకు ఫిర్యాదులు కోకొల్లలుగా వస్తున్నాయి.
చెరువులు, జలాశయాలకు సమీపంలో..
జలాశయాలు, చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములకు సమీపంలోని ప్రాజెక్టుల విషయంలో కొనుగోలుదారులు అన్ని విషయాలను నిశితంగా పరిశీలించాలి. ప్రభుత్వ భూములు ఆక్రమించడం, చెరువులు, కుంటల్లో నిర్మాణాలు చేపట్టి వాటిని ప్రైవేటు భూమి సర్వే నెంబరుతో రిజిస్ట్రేషన్ చేయించి మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌లో ఇలాంటి మోసానికి పాల్పడిన ఒక సంస్థపై రెరా కేసు నమోదు చేసింది. ధర తక్కువ అని తొందరపడి చిక్కుల్లో పడకుండా ప్రతిదీ పూర్తిగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
చెల్లింపుల పరంగా...
స్థిరాస్తి కొనుగోళ్లలో సేల్ ఆఫ్ అగ్రిమెంట్ వంటివి లేకుండా ముందే డబ్బులు చెల్లించి ఇబ్బందులు పడొద్దు. చెల్లించిన మొత్తానికి తగిన రసీదులు తప్పనిసరిగా తీసుకుని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఆన్‌లైన్ చెల్లింపులు, చెక్‌ల రూపంలో ఆధారాలతో ఏదైనా తేడా వస్తే ఒప్పందం ప్రాతిపదికగా రెరాని ఆశ్రయించే వీలుంది. మరో సంస్థను ఆశ్రయించినా న్యాయం పొందేందుకు అవకాశాలుంటాయి.
వివాదం తలెత్తితే...
కొనుగోలుదారులు, నిర్మాణదారులు, డెవలపర్ల మధ్య వివాదాలను నేరుగా పరిష్కరించుకోవచ్చు. అదే సమయంలో ఆయా సమస్యలను లిఖిత పూర్వకంగా బిల్డర్ దృష్టికి తీసుకుపోవాలి. సమస్యను సదరు నిర్మాణదారు పరిష్కరించకుంటే ఎన్నిసార్లు ఫిర్యాదు చేశారు? అనే విషయంతో పాటు వారి నుంచి కరవైన స్పందనను చట్టబద్ధ సంస్థల దృష్టికి తీసుకెళ్లడానికి వీలుంటుంది. లేదంటే కొనుగోలుదారులు తమ దృష్టికి ఎలాంటి సమస్యలను తీసుకురాలేదని బిల్డర్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు.
అత్యధికం ఒప్పంద ఉల్లంఘన ఫిర్యాదులే..
తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్ రెరా)కి అక్టోబరు 31 నాటికి 2,168 ఫిర్యాదులు రాగా, అందులో 1213 కేసుల్లో రెరా స్పందించి ఉత్తర్వులు జారీ చేసింది. వాటిలో అత్యధికం ఒప్పంద ఉల్లంఘన ఫిర్యాదులే కావడం గమనార్హం. కొనుగోలుకు ముందు చెప్పిన విషయాలను విస్మరించారనే ఫిర్యాదులే అధికం. కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని అత్యాశకు పోయి ఇబ్బందులు పడొద్దని స్థిరాస్తి రంగ నిపుణులు సూచిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ లేటెస్ట్ రిపోర్ట్- హైదరాబాద్‌లో అతితక్కువ గ్రోత్- టాప్ 8 సిటీస్‌లో లాస్ట్!