Uppada Coastal Area Fishermen Problems: కాకినాడ జిల్లా ఉప్పాడ గ్రామంలో సముద్ర తల్లినే నమ్ముకున్న గంగపుత్రులకు కష్టం వచ్చింది. ఏటా నిలువ నీడనిచ్చే గూడులను కడలి అమాంతంగా మింగేస్తోందని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. తీరం కోత సమస్యతో గ్రామంలో చాలా భూమి కోల్పోయామని వాపోతున్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమస్యపై దృష్టి పెట్టడం, నిపుణులతో అధ్యయనం చేయించడంతో తమ కష్టాలు తీరుతాయని మత్స్యకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఉప్పాడ గ్రామంలోని మత్స్యకారులకు చేపట వేట ప్రధాన జీవనాధారం. అందువల్ల సముద్రం సమీపంలోనే పక్కా గృహాలు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. ఏటా ప్రకృతి వైపరీత్యాల సమయంలో అలల ఉద్ధృతికి గ్రామం మీదకు కెరటాలు ఎగసిపడుతున్నాయి. ఇళ్లను సైతం కూలగొట్టి, కడలి తనలో కలిపేసుకుంటుందని ఆవేదన చెందుతున్నారు. గతంలో జనవాణి కార్యక్రమంలో ఓ కార్యకర్త ఈ సమస్యను జనసేనాని దృష్టికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్ ముందుగా తమ సమస్య పరిష్కార మార్గం కోసం ఆలోచన చేస్తున్నారు. బుధవారం కాకినాడ జిల్లాలో పర్యటించిన ఆయన వాకతిప్ప ఫిషింగ్ హార్బర్, సూరప్ప తాగునీటి చెరువుతో పాటు ఉప్పాడలో కోతకు గురైన తీరప్రాంతాన్ని పరిశీలించారు. తీర ప్రాంతం కోతకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో పవన్ చర్చించారు.
ఉప్పాడ తదితర 8 గ్రామాల్లో ఇప్పటివరకు 1,360 ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయిందని సర్వే అధికారులు వివరించడంతో ఉపముఖ్యమంత్రి విస్మయం చెందారు. జియో ట్యూబ్, రక్షణ గోడలు నిర్మిస్తే మత్య్సకార గ్రామాలకు భద్రత ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కోత నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసి సమస్యకు పరిష్కారం సూచించాలని ఉపముఖ్యమంత్రి చెప్పడంపై ఉప్పాడ గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామం సురక్షితంగా ఉండాలంటే రక్షణ గోడ నిర్మించాలని, ఆ దిశగా ప్రయత్నం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం వందల ఎకరాలకు పైగా ఉప్పాడ గ్రామ భూమి సముద్ర కోతకు గురైందని జిల్లా అధికారులు చెబుతున్నారు. తీరప్రాంత కోతను అరికట్టకపోతే భవిష్యత్తులో ఉప్పాడ గ్రామస్థులు అనేక సమస్యలు చవిచూస్తారని మారిటైమ్ బోర్డు, సముద్ర అధ్యయన శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. సముద్ర కోతకు రక్షణగోడ నిర్మాణమే పరిష్కార మార్గమని సూచిస్తున్నారు.
తీర ప్రాంతాల్లో స్వచ్ఛతపై యానిమల్ వారియర్స్ కృషి