Private Schools Literally Robbing Parents : పిల్లలు ప్రయోజకులు కావాలని, ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించిన తల్లిదండ్రులకు చదువులు గుదిబండగా మారుతున్నాయి. ఫీజులు, పుస్తకాల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి ఎక్కువైంది. అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల నిర్వహణలో నిమగ్నమైన వేళ ప్రైవేటు యాజమాన్యాల వేధింపులకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.
Kurnool Private Schools : ఉమ్మడి కర్నూలు జిల్లాలో 410 ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి. వేలాది మంది విద్యార్థులు వీటిలో విద్యను అభ్యసిస్తున్నారు. సంపన్న వర్గాలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు సహా పేదవారు సైతం తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశంతో ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చదివిస్తున్నారు. ఏప్రిల్ నెలలో విద్యా సంవత్సరం ముగిసింది. ఇదే ఏడాది ఎన్నికలు సైతం రావడంతో అధికర యంత్రాంగం మొత్తం ఎన్నికల నిర్వహణలో నిమగ్నమైంది. ఇదే అదనుగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు, పుస్తకాల పేరుతో వేధింపులు ప్రారంభించాయి.
చదువులు చాలించేస్తున్నారు!- పదో తరగతిలోపే బడి మానేస్తున్న విద్యార్థులు - DROPOUT RATE IN AP
నూతన విద్యా సంవత్సరం పుస్తకాలు వచ్చాయని, జూన్‌లో పాఠశాలలు ప్రారంభమవుతాయని మొదట పుస్తకాలు కొనుగోలు చేయాలని తరచూ పాఠశాలల యాజమాన్యాల నుంచి తల్లిదండ్రులకు ఫోన్లు వస్తున్నాయి. గతేడాది ఫీజు బకాయిలు తప్పని సరిగా చెల్లిస్తేనే ఈ ఏడాది తమ పిల్లలకు అడ్మిషన్ ఉంటుందని బెదిరిస్తున్నారు. ఈ క్రమంలోనే 2024-25 సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత ఫీజులు కట్టాలని వేధిస్తున్నారు. ఒకవైపు పాఠశాల యాజమాన్య ఫీజులు, మరో వైపు పుస్తకాల కోసం వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకటో తరగతి చదివే పిల్లల పుస్తకాలు కొనుగోలు చేయాలన్నా కనీసం ఐదు వేల రూపాయలు ఖర్చు చేయాలని తల్లిదండ్రులు వాపోతున్నారు. అది కూడా అదే పాఠశాలలో కొనుగోలు చేయాలిని యాజమాన్యాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు యూనిఫాంలు సైతం వచ్చాయని వాటికి కూడా డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని విద్యాశాఖ దృష్టికి తీసుకువెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలో పాఠ్య పుస్తకాలు ఇంకా రాలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే ప్రైవేటు పాఠశాలల అరాచకాలను అరికట్టాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నారు.