Poor Quality Works in Jagananna Colonies in Perecherla : జగనన్న కాలనీల పేరుతో సొంతింటి కలను నెరవేరుస్తున్నామంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదలను వంచిస్తోంది. నాసిరకం ఇళ్లను నిర్మిస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతోంది. జగనన్న కాలనీల్లో కట్టేది "ఇళ్లు కాదు - ఊళ్లు " అంటూ ఊదరగొడుతూనే ఏ మాత్రం అనువుగా లేని ఇళ్లను కట్టబెట్టేందుకు యత్నిస్తోంది. జగన్ మాటలు నమ్మి ఎంతో ఊహించుకున్న లబ్ధిదారులంతా పిల్లర్లు లేని ఇళ్లు, పడిపోయేలా ఉన్న గోడలను చూసి నోరెళ్లబెడుతున్నారు. గుంటూరు జిల్లా పేరేచర్లలో నిర్మాణం పూర్తికాకముందే గోడలకు పగుళ్లు రావడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Lack Of Facilities: రాష్ట్రంలోనే అతిపెద్ద జగనన్న కాలనీగా పేరొందిన గుంటూరు జిల్లా పేరేచర్లలో ఇళ్ల నిర్మాణాల పరిస్థితి 'పేరు గొప్ప ఊరు దిబ్బ' సామెతను తలపిస్తోంది. ఓవైపు మౌలిక సదుపాయాలు, తాగునీటి సమస్యలతో జగనన్న కాలనీ లబ్ధిదారులు అవస్థలు పడుతుంటే మరోవైపు నాసిరకం ఇళ్ల నిర్మాణాలను చూసి వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. సమాన నిష్పత్తిలో కాంక్రీటును ఉపయోగించకుండా గోడలు కడుతున్నారు. కొన్నిచోట్ల అసలు పునాదులు, పిల్లర్లు లేకుండానే ఇళ్లు నిర్మించి మమ అనిపించేస్తున్నారు. ఫలితంగా లబ్ధిదారులకు అందించక ముందే ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయి.
జగనన్న ఇళ్ల స్థలాలపై వైసీపీ డేగల కన్ను- పేదరికాన్ని సొమ్ము చేసుకుంటున్న దళారులు
పేరేచర్లలో 2020లో 18 వేల 90 మందికి స్థలాలు కేటాయించారు. మొదట విడతగా 9 వేల 219 మందికి 2021లోనే ఇళ్లు మంజూరు చేశారు. వీరందరికీ ఆప్షన్-3 కింద ఇళ్లు కట్టించి తాళాలు చేతికి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మిగతా 6 వేల 152 మందికి రెండో విడతలో మంజూరు చేస్తామన్నారు. కానీ ఇక్కడ పూర్తయిన గృహాలు కేవలం 14 వందల 41 మాత్రమే. ఆర్‌ఎల్, ఆర్‌సీ స్థాయిల్లో 593 నిర్మాణాలున్నాయి. 6 వేల 774 నిర్మాణాలు బేస్‌మెంట్, అంతకంటే తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. అంటే నిర్మాణాలు చేపట్టిన గృహాల్లో 70 శాతం ఇంకా బేస్‌మెంట్ స్థాయిని కూడా దాటలేదు. ఇక ఇళ్ల నిర్మాణాల పర్యవేక్షణ విషయానికి వస్తే వాటిని పట్టించుకున్న నాథుడే కరవయ్యారు. ప్రభుత్వం లబ్ధిదారులకు లక్షా 80 వేల రూపాయిలతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పింది. కానీ ఈ లక్షా 80 వేలకు మరో 35 వేలను పొదుపు సంఘం లబ్ధిదారుల ఖాతాల నుంచి తీసుకుని నిర్మాణానికి వినియోగిస్తున్నారు. అంటే మెుత్తంగా 2 లక్షల 15 వేల రూపాయలను ఇళ్ల నిర్మాణానికి వినియోగిస్తున్నారు. గుత్తేదారులు నిర్మాణ ప్రమాణాలకు తిలోదకాలిస్తున్నా పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లన్నీ పేదలకు శాపంగా మారాయి: కాలవ శ్రీనివాసులు
జగనన్న కాలనీ నిర్మాణంలో అంతర్గత రోడ్లు, డ్రైన్లు, డిజిటల్ లైబ్రరీ, అంగన్వాడీ కేంద్రం, వైఎస్‌ఆర్ క్లినిక్, పార్కు, పాఠశాలను నిర్మిస్తామని మంత్రులు హడావుడి చేశారు. అవసరమైతే ప్రత్యేక బస్సు సర్వీసును అందుబాటులోకి తెస్తామని ప్రగల్భాలు పలికారు. వాటి సంగతి పక్కన పెడితే కనీసం నివాసయోగ్యం కాని ఇళ్లను నిర్మిస్తున్నారని లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పరిపాలన సౌలభ్యం కోసం పర్యవరణానికి నష్టం కలిగిస్తూ వందల కోట్లతో భవనాలు నిర్మిస్తున్న ప్రభుత్వం పేదల సొంతింటి నిర్మాణంలో మాత్రం వివక్ష చూపుతోందని ప్రజాసంఘాలు, విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.