Pond Lands kabja in Kurnool : కర్నూలులో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వాగు పోరంబోకు, చెరువు భూములను ఆక్రమించి తన సామ్రాజ్యంలో కలిపేసుకుంది. కర్నూలు నుంచి నందికొట్కూరు వెళ్లే మార్గంలో గార్గేయపురం చెరువు ఉంది. దానిని ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాన్ని గతంలో తెలుగుదేశం సర్కార్ నగర వనంగా అభివృద్ధి చేసింది. గార్గేయపురం చెరువు పరిధిలో 140 ఎకరాల సాగు భూమి ఉంది. ఈ భూమిని రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు అప్పటి ప్రభుత్వం ఇచ్చింది.
YSRCP Leaders Occupied Ponds : ఈ భూమిలోని కొంత భూమిని రెండేళ్ల క్రితం వైఎస్సార్సీపీ హయాంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొనుగోలు చేశారు. దీనికి ఆనుకుని ఉన్న వాగు పోరంబోకు భూములను హాయిగా కబ్జా చేసేశారు. చెరువు నుంచి కిందికి వచ్చే రెండు వాగుల్లో రెండు బ్రిడ్జిలు నిర్మించేశారు. ఈ రెండు వంతెనలకు, వెంచర్‌కు అధికారులు అనుమతులిచ్చేశారు. సుమారు 20 ఎకరాలకుపైగా రియల్ ఎస్టేట్ వెంచర్ వేయగా 12 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి.
రెండు వాగుల్లో బ్రిడ్జిల నిర్మాణం : సర్వే నంబర్ 215లో కడగమ్మువాగు అలుగు నుంచి మూడు బావుల వరకు సుమారు కిలోమీటర్ మేర పొడవు ఉన్న 6 ఎకరాల వాగు పోరంబోకును ఆక్రమించారు. సర్వే నంబర్ 701 నుంచి 711 వరకు పాత కెనాల్ పోరంబోకు భూమి 11 ఎకరాలు ఉంది. ఇందులోనూ 6 ఎకరాల వరకు ఆక్రమించేశారు. రెండు వంతెనలు సైతం నిర్మించారు. వాగుపై ఓ వంతెన నిర్మాణానికి 2023 జూలై 13న అనుమతి ఇచ్చారు. రెండో వంతెన నిర్మాణానికి ఈ ఏడాది ఏప్రిల్ 12న తాత్కాలిక అనుమతి ఇచ్చారు. కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు సైతం ఈ వెంచర్‌కు 2023 జూన్ 7న అనుమతులు మంజూరు చేశారు.
"అటవీశాఖ భూములను పేదలకు ఇచ్చారు. వారి నుంచి కొని ఓ కంపెనీకి ఇస్తారు. ఇందులో పెద్ద కుంభకోణం దాగి ఉంది. యదేచ్ఛగా అటవీ భూములను ఆక్రమించారు. అధికారులు కూడా వాటికి అనుమతులు ఇచ్చారు. దీనిపై స్వయంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తాం. వీటిపై విచారణ జరిపిస్తాం. తిరిగి ఆ భూములను పేదలకు పంచుతాం." - బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
నాగార్జునరెడ్డి అనే వ్యక్తి గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి, అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి బినామీగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వారి హస్తం ఉండటంతోనే యథేచ్ఛగా వాగు పోరంబోకు స్థలాన్ని కబ్జా చేశారు. నీటిపారుదల శాఖ అధికారులు కూడా అనుమతులు ఇచ్చారని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణలో వాగులు, చెరువుల ఆక్రమణలను ప్రభుత్వం తొలగిస్తోంది. రాష్ట్రంలోనూ ఇదే విధానాన్ని అనుసరించాలని స్థానికులు కోరుతున్నారు.
కొల్లేరులో వైసీపీ కల్లోలం - ఇష్టారాజ్యంగా అక్రమ చెరువుల తవ్వకాలు