Police Stopped Rajdhani Files Movie Screening: రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శన ఆపే విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించింది. రాజధాని ఫైల్స్ సినిమా విడుదలపై హైకోర్టు స్టే ఇవ్వడమే ఆలస్యం, కనీసం ఆర్డర్ కాపీ రాకముందే, ఆఘమేఘాల మీద రాష్ట్రవ్యాప్తంగా అన్ని సినిమా ధియేటర్లపైకి అధికారులను ఉసిగొల్పింది. తక్షణం సినిమా ప్రదర్శనలు ఆపాలని పైస్థాయి నుంచి ఆదేశాలు జారీ చేసింది.
ఆర్డర్ కాపీ చూపించమంటే నీళ్లు నమిలిన అధికారులు: హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శిస్తోన్న థియేటర్లకు వెళ్లి షోను అర్ధాంతరంగా ఆపేశారు. విజయవాడలో పలు థియేటర్లలో సినిమాను మధ్యలో ఆపివేశారు. బెంజి సర్కిల్లోని ట్రెండ్ సెట్ మాల్‌కు వెళ్లిన రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రదర్శన నిలిపివేయడంతో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు స్టే ఇచ్చిన కారణంగా ప్రదర్శన నిలిపేస్తున్నట్లు బదులిచ్చారు. స్టే ఆర్డర్ కాపీ చూపించాలని పలువురు ప్రేక్షకులు నిలదీయగా అధికారులు నీళ్లు నమిలారు. ఆర్డర్ కాపీ లేకపోవడంతో అడ్డగోలుగా మాట్లాడారు. ఆర్డర్ కాపీ లేకుండా సినిమా ఎలా ఆపుతారని పలువురు నిలదీశారు. దీంతో సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని లేనిపక్షంలో తీవ్ర చర్యలు తీసుకుంటామని థియేటర్ యజమానులను పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హెచ్చరించారు. దీంతో చేసేదేమీ లేక ప్రదర్శనను మధ్యలోనే నిలిపివేశారు.
'రాజధాని ఫైల్స్' సినిమాను ఆపండి - హైకోర్టులో వైఎస్సార్సీపీ నేత పిటిషన్
ఒంగోలులో డబ్బులు తిరిగి చెల్లించిన యజమాన్యం: ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులు రాజధాని ఫైల్స్ సినిమా ఆట మధ్యలో నిలిపేయడంతో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేసారు. సినిమా ప్రదర్శించి సుమారు 40 నిమిషాలు పూర్తయిన సమయంలో ఒంగోలు గోపీ థియేటర్‌కు సిబ్బందితో వచ్చి, ఆటను నిలిపివేసారు. అర్థంతరంగా ప్రదర్శనను నిలిపివేయడంతో అర్ధం కాని ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. థియేటర్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. సీఐ వచ్చి కోర్టు స్టే ఇచ్చిందని, ప్రదర్శన నిలపి వేయాలని కోరారు. లిఖితపూర్వకమైన ఆదేశాలు ఇవ్వాలని థియేటర్ సిబ్బంది కోరగా, అలాంటివి ఏమీ లేవంటూ ప్రదర్శనను బలవంతంగా నిలిపివేసారు. యాత్ర సినిమాలో లేని అభ్యంతరాలు రాజధాని ఫైల్స్ సినిమాలో కనిపించాయా అంటూ పలువురు ప్రేక్షకులు ప్రశ్నించారు. ప్రేక్షకులు ఆందోళన చేయడంతో థియేటర్ యజమాని టికెట్ డబ్బులు తిరిగి చెల్లించారు.
'రాజధాని ఫైల్స్'కు యూట్యూబ్‌లో విశేష స్పందన - కొన్ని క్లిపింగ్స్లు తెగ వైరల్
మధ్యతంర ఉతర్వులు ఇచ్చిన హైకోర్టు: రాజధాని ఫైల్స్ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం నేడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా విడుదలను రేపటి వరకు నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా పూర్తి రికార్డ్స్‌ను తమ ముందు ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. సీఎం జగన్, కొడాలి నానిని పోలిన పాత్రలున్నాయని, వారిని కించపరిచే విధంగా చిత్రీకరించారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం రేపటి వరకు సినిమా విడుదలను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
రాజధాని ఫైల్స్ చిత్రానికి ఏ పార్టీతో సంబంధం లేదు: మూవీ యూనిట్