Kavali Boy Kidnap Case : పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. వెంగళరావునగర్‌లో ఉంటున్న పల్లాపు రాజేశ్వరికి ఏడాది వయసున్న తేజ అనే కుమారుడు ఉన్నాడు. సోమవారం ఆమె తన చిన్నారిని ఊయలలో పడుకోబెట్టి స్నానానికి వెళ్లింది. తిరిగి వచ్చే సరికి బిడ్డ కనిపించలేదు. ఆందోళనకు గురైన ఆ తల్లి చుట్టుపక్కల ఆరా తీసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాపు ప్రారంభించారు.
చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమించారు. ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించారు. బాలుడిని ఓ మహిళ తీసుకెళుతున్న దృశ్యాలు కనిపించాయి. ఆమె ఇంటి పరిసరాల్లో ఉంటున్న ఇళ్లలో పనిచేసే స్వరూపగా స్థానికులు నిర్ధారించారు. ఈ క్రమంలోనే చిన్నారి చిత్రాలను రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపి ఈ విషయాన్ని తెలిపారు.
అనుమానించి విచారించి : సమాచారం అందుకున్న పొన్నలూరు ఎస్సై అనూక్ మండలంలోని నాగిరెడ్డిపాలెంలో మంగళవారం నాడు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ కనిగిరి నుంచి పొన్నలూరు మండలం మీదుగా కారులో చిన్నపిల్లవాడితో వెళ్తుండటాన్ని గుర్తించారు. అనుమానించిన ఎస్సై ఆరా తీయడంతో కిడ్నాప్ విషయం వెలుగు చూసింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకొని బాలుడిని కావలి పోలీసులకు అప్పగించారు.
డబ్బుపై ఆశతో : ఇళ్లలో పనులు చేసి జీవించే స్వరూప డబ్బు సంపాదించాలని భావించింది. దీంతో రాజేశ్వరి కుమారుడిని అపహరించి విక్రయించాలని పన్నాగం పన్నింది. ఈ నేపథ్యంలో తనను ఎవరూ అనుమానించకూడదనే భావనతో సదరు చిన్నారి ఇంటికి కొన్నాళ్లుగా వెళ్తూ ఆడిస్తోంది. చాక్లెట్లు ఇస్తూ దగ్గర చేసుకుంది. రాజేశ్వరి బాలుడిని ఊయలలో పడుకోబెట్టి స్నానానికి వెళ్లిన విషయాన్ని స్వరూప గమనించి అపహరించింది. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది. బాలుడిని బాధిత తల్లిదండ్రులకు అప్పగించారు. తమ బిడ్డ దొరకడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. కుమారుడిని ఎత్తుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆ తల్లిదండ్రులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
భాకరాపేట కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు - డమ్మీ పిస్టల్, మత్తు సిరంజీలు స్వాధీనం - KIDNAP CASE