Police Seized a Huge Liquor Dump : తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైఎస్సార్సీపీ నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. నగరిలో అధికార పార్టీ అభర్థి రోజా (Roja) నామినేషన్ నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల్లో డంప్ బయటపడింది.
పుత్తూరు బైపాస్ గోవిందపాలెం సమీంలో తనిఖీ చేస్తుండగా మద్యం తరలిస్తూ పుత్తూరు మున్సిపల్ వైస్‌ఛైర్మన్ సమీప బంధువు పట్టుబడ్డాడు. దీంతో కేసు లేకుండా చేసేందుకు పోలీసులపై రాత్రి నుంచి మంత్రి తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుడు నారాయణవనం పోలీసుల అదుపులో ఉండగా ఇంకా కేసు నమోదు చేయలేదు. మరోవైపు శ్రీవిద్యా డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్మాణంలో ఉన్న భవనంలో భారీగా మద్యాన్ని దాచారు. కళాశాల యజమాని సోదరి పుత్తూరు పురపాలక సంఘ కౌన్సిలర్. వైకాపా నాయకులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అక్రమంగా 170 కేసుల మద్యం : ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైఎస్సార్సీపీ నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. చిత్తూరు జిల్లా కొంగారెడ్డిపల్లిలో ఉన్న చిత్తూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రాజేష్‌రెడ్డికి చెందిన కారు షెడ్డుపై వన్‌టౌన్ పోలీసులు, ఎస్‌ఈబీ అధికారులతో కలిసి ఫ్లయింగ్ స్క్వాడ్ గురువారం దాడి చేసింది. ఆ సమయంలో షెడ్డులో ఉన్న వ్యక్తిని విచారించగా తాను స్వీపర్‌నని, ఈ షెడ్డు డిప్యూటీ మేయర్ రాజేష్‌రెడ్డిదని చెప్పడంతో అధికారులు దానిని వీడియో తీసుకున్నారు. 170 కేసుల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ రూ.10.28 లక్షలు ఉంటుందని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వెల్లడించారు. సరకును చిత్తూరు అర్బన్ ఎస్‌ఈబీ అధికారులకు అప్పగించామని, రాజేష్‌రెడ్డిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
6,240 సీసాల గోవా మద్యం : డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులోని వైసీపీ నాయకుడికి చెందిన ఒక ఇటుక బట్టీలో రూ.7.8 లక్షల విలువైన గోవా మద్యం సీసాలను ఎస్‌ఈబీ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. పెనికేరు రహదారిపై ఉన్న ఈ బట్టీలో మద్యం సీసాలున్నట్లు విశ్వసనీయమైన సమాచారం అందడంతో ఎస్‌ఈబీ అధికారులు దాడి చేశారు. స్థానిక వైసీపీ నాయకుడు, ప్రస్తుతం మండపేట వైసీపీ ఎన్నికల పరిశీలకుడుగా ఉన్న సీహెచ్ ప్రభాకరరావు ఈ బట్టీ యజమాని. మొత్తం 130 బాక్సుల్లో ఉన్న 6,240 సీసాల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఈబీ ఎస్సై సత్యవాణి తెలిపారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అమర్‌బాబు, రాజోలు సీఐ పి.శ్రీనివాస్, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యురాలు పోచమ్మ తదితరులు పాల్గొన్నారు.
కర్ణాటక నుంచి అక్రమ మద్యం తరలింపు - 24 బాక్సులు స్వాధీనం - Police Seized Liquor Bottles
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం : ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్‌సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. ముండ్లమూరులోని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి కారులోకి మద్యం కేసులు ఎక్కిస్తుండగా ఎస్‌ఈబీ సిబ్బంది దాడి చేసి 20 కేసులను పట్టుకున్నారు. కారు డ్రైవర్ శ్రీరామ్ కొండయ్యను అదుపులోకి తీసుకొని విచారించగా మండలంలోని పెదఉల్లగల్లు పంచాయతీ పరిధిలోని లక్ష్మీనగర్‌కు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఆ ప్రాంతంలో నివాసం ఉండే ఈరంరెడ్డి మాలకొండారెడ్డి ఇంటిని తనిఖీ చేయగా 223 మద్యం కేసులు బయటపడ్డాయి.
పెదఉల్లగల్లు, ముండ్లమూరు, మారెళ్ల గ్రామాల్లోని ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి ఈ కేసులను నిందితులు సేకరించారు. ఘటనకు సూత్రధారిగా భావిస్తున్న వైసీపీ ముఖ్య నాయకుడు మేడం రమణారెడ్డి, మద్యం నిల్వ చేసిన మాలకొండారెడ్డి, డ్రైవర్ కొండయ్య, వీరికి సహకరించిన చిన్నబాల, మూడు దుకాణాల్లో పనిచేస్తున్న సూపర్‌వైజర్లు షేక్ అంజిబాబు, గండి జక్రయ్య, గోపిరెడ్డి వెంకటరెడ్డిలతో పాటు ఆరుగురు సేల్స్‌మన్‌పై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. రమణారెడ్డి, అంజిబాబులు తప్ప మిగిలిన వారిని అరెస్టు చేశామన్నారు. 11,825 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.20.63 లక్షలు ఉంటుందని తెలిపారు.
వైఎస్సార్సీపీ మద్యం టోకెన్లు- తిరుపతిలో జోరుగా పంపిణీ - Telugu youth leaders press meet