Marijuana Trafficking in AP : అల్లూరి సీతారామరాజు జిల్లాలో పెద్దఎత్తున గంజాయి పట్టుబడింది. పెదబయలు మండలం లింగేరిపుట్టు జంక్షన్‌లో పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వారిని అదుపులో తీసుకుని ప్రశ్నించగా సమీపంలోనే రవాణాకు సిద్ధంగా ఉంచిన గంజాయి విషయం బయటపడింది. 220 కేజీల ఉన్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేశారు.
అక్కడి యువతకు సరఫరా : అలాగే విజయవాడ నగర పోలీస్ కమీషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణ చేస్తోన్న 12 మందిని టాస్క్ ఫోర్స్, శాంతిభద్రత బృందాలు అరెస్టు చేశాయి. వీరి నుంచి లక్షా 40 వేల రూపాయల విలువైన 23 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఏడీసీపీ ఎ. శ్రీనివాసరావు తెలిపారు. నిందితుల్లో కృష్ణా జిల్లా కంకిపాడు, పెనమలూరు, పోరంకి, తాడిగడప ప్రాంతానికి చెందిన పాత నేరస్తులతోపాటు విజయవాడ అయోధ్య నగర్, భవానీపురం, మురళీనగర్, సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు వెల్లడించారు. వీరంతా సులభంగా డబ్బులు సంపాదించడానికి గంజాయిని అక్రమంగా కొనుగోలు చేసి వాటిని విజయవాడలోని పలు ప్రాంతాలలోని యువకులకు అమ్ముతున్నట్లు గుర్తించారు.
వచ్చిన డబ్బుతో జల్సాలు : నిందితుల్లో ఎనిమిది మందిపై గతంలోనే పోలీసు షీట్లు ఉన్నాయని, గంజాయి కేసుల్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చారని పోలీసులు తెలిపారు. వీరంతా ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతాలకు వెళ్లి అక్కడి నుంచి గంజాయిని తక్కువ డబ్బులకు సేకరిస్తున్నారని వెల్లడించారు. అనంతరం ఆ గంజాయిని అధిక డబ్బులకు విక్రయించడం ద్వారా వచ్చిన మొత్తంతో జల్సాలు చేసుకుంటున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు వివరించారు.
'పిల్లలకు గంజాయి ఇచ్చి చోరీలు' - రక్షించాలంటూ తల్లిదండ్రుల విజ్ఞప్తి
గంజాయి క్వీన్ నీతూ కోసం తీవ్రంగా గాలింపు - ఫ్యామిలీ మొత్తం ఇదే దందా