Police Search for Marijuana Suspects : ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంజాయి కేసుల్లో పట్టుబడి జైలుకు వెళుతున్నారు. కొన్ని రోజులకు బెయిల్‌పై జైలు నుంచి బయటకు వస్తున్నారు. తరువాత కోర్టు విచారణకు హాజరు కావడం లేదు. వారిలో చాలా మంది ఆచూకీ కూడా ఉండటం లేదు. గంజాయి తరలిస్తూ పట్టుబడిన వారిని విచారించే సమయంలో మరికొందరి బయట వ్యక్తుల ప్రమేయమూ వెలుగు చూస్తోంది. పోలీసులు వారిపైనా కూడా కేసులు నమోదు చేస్తున్నారు. అరెస్ట్ చేయడానికి వెళ్తే జాడ లేకుండా పోతున్నారు. విశాఖ రేంజ్ పరిధిలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో 9 వందల మందికిపైగా తప్పించుకు తిరుగుతున్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి గత 5 నెలల్లో 237 మందిని పట్టుకున్నారు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు.
29 ప్రత్యేక బృందాలు గాలింపు : ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట గంజాయి పట్టుపడుతూనే ఉంది. నిందితుల్లో కొందరు పోలీసులకు చిక్కుతున్నారు. మరికొందరు వారి నుంచి తప్పించుకుపోతున్నారు. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి రిమాండుకు పంపుతున్నారు. వీరిలో కొందరు బెయిల్‌పై వచ్చాక పోలీసులకు కనిపించకుండా తిరుగుతున్నారు. కోర్టు వాయిదాలకు హాజరు పరచాలని సమన్లు జారీ అవుతున్నా నిందితుల పత్తా దొరక్క, కేసుల పురోగతి ముందుకు వెళ్లడం లేదు.
'పుష్పా' ఎర్రచందనమే కాదు - మన శీలావతికీ దేశవ్యాప్త డిమాండ్
అనకాపల్లి జిల్లా చోడవరం కోర్టు పరిధిలోనే 2019 తరువాత బెయిల్‌పై వచ్చి తదుపరి విచారణకు హాజరుకాని వారు 27 మంది వరకు ఉన్నారు. వీరిలో 16 మందిపై నాన్ బెయిల్‌బుల్ వారెంట్లు జారీ అయ్యాయి. వీరి కోసం గాలిస్తున్నట్లు చోడవరం ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ పాపునాయుడు తెలిపారు. ఇక్కడే కాదు 3 ఉమ్మడి జిల్లాల పరిధిలోనూ పరారీ నిందితులు భారీగానే ఉన్నారు. వీరి కోసం 29 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో వారిని పట్టుకుని తీసుకురావడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది.
ప్రతి ఒక్కరిని పట్టుకుని శిక్ష పడేలా చేస్తాం : ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గంజాయిపై ఉక్కుపాదం మోపేలా చర్యలు తీసుకుంటున్నారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలో ఈ 5 నెలల్లో సుమారు 12 వేల కేజీల గంజాయిని పట్టుకున్నారు. 476 మందికిపైగా అరెస్టు చేశారు పోలీసులు. నిందితుల్లో ఎక్కువ మంది ఒకటి కంటే ఎక్కువ సార్లు పట్టుబడుతున్న వారే ఉన్నారు. అలాంటి వారిలో 247 మందిపై గంజా షీట్లు (రౌడీ షీట్లు మాదిరిగా) ఓపెన్ చేశారు. మరో 21 కేసుల్లో నిందితులపై పీడీ చట్టం ప్రయోగించేందుకు సిద్ధం అవుతున్నారు. గతంలో గంజాయి సాగు చేసిన రైతుల వివరాలను సర్వే నంబర్ల ఆధారంగా గుర్తించి వారికి ప్రత్యామ్నాయ పంటల సాగుకు విత్తనాలు ఇవ్వడంతో పాటు ఇకపై గంజాయి సాగు చేపట్టబోమని వారి నుంచి లేఖలు తీసుకుంటున్నారు.
బడ్డీ కొట్టులో గంజాయి చాక్లెట్లు - వ్యక్తి అరెస్ట్
ఇటీవల కొంతమంది జి.మాడుగుల ప్రాంతంలో గంజాయి సాగు చేస్తున్నట్లు డ్రోన్లతో గుర్తించి పంటను ధ్వంసం చేశారు. అంతే కాకుండా సంబంధిత రైతులపై కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో గంజాయి, మద్యం సేవిస్తున్న వారిని డ్రోన్ల సహాయంతో గుర్తించి పట్టుకుంటున్నారు. గంజాయి కట్టడికి బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు డీఐజీ గోపీనాథ్ జెట్టి వివరించారు. సాగు, రవాణాపైనే కాదు ఉపయోగంపైనా దృష్టి సారించినట్లు, ఇప్పటి వరకు 948 విద్యా సంస్థల్లో 3 వేలకుపైగా అవగాహన కార్యక్రమాలు చేపట్టామని, 86 మందిని వ్యసన విముక్తి కేంద్రాల్లో చేర్పించినట్లు తెలిపారు. గంజాయి నిందితులు ఎక్కడ ఉన్నా వదిలి పెట్టే ప్రసక్తే లేదని, ప్రతి ఒక్కరిని పట్టుకుని శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు.
గంజాయి అడ్డుకట్టకు 'ఈగల్' - 1972టోల్ ఫ్రీ నంబర్ ఆవిష్కరించనున్న సీఎం : హోంమంత్రి అనిత