Hookah Centers in Hyderabad : హైదరాబాద్‌లో హుక్కా కేంద్రాల దందా ఆగడం లేదు. తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించినా అనేక ప్రాంతాల్లో గుట్టుగా ఈ దందా కొనసాగుతోంది. కేఫేలు, పార్లర్లు, రెస్టారెంట్ల పేరుతో అపార్టుమెంట్లు, కాలనీల్లో అడ్డగోలుగా వీటిని నడిపిస్తున్నారు. నేరగాళ్లు తమ గుట్టు బయటపడకుండా తెలిసిన వ్యక్తుల్ని మాత్రమే అనుమతిస్తున్నారు.
ముఖ్యంగా పాతబస్తీ, పరిసర ప్రాంతాల్లో ఈ దందా ఎక్కువగా నడుస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో హుక్కా కేంద్రాల్ని నిషేధిస్తూ చట్టం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా పోలీసు తనిఖీల్లో తరచూ హుక్కా దందా వెలుగు చూస్తుంది. ఈ నెల 4న మహేశ్వరం ఎస్వోటీ పోలీసులు బాలాపూర్ ఠాణా పరిధిలోని బర్మాకాలనీలో తనిఖీలు చేసినప్పుడు ఓ హుక్కా కేంద్రాన్ని గుర్తించారు.
పరిచయస్థులకే అనుమతి : గతంలో హైదరాబాద్‌లోనే ఎక్కువగా హుక్కా కేంద్రాలుండేవి. పొగాకు ఉత్పత్తులు వాడొద్దని నిబంధనలున్నా పట్టించుకునేవారు కాదు. మైనర్లను అనుమతించడంతో పాటు అనైతిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తరచూ పోలీసుల తనిఖీల్లో బయటపడేది. పొగాకు ఉత్పత్తులతో పాటు మద్యం, గంజాయి, డ్రగ్స్ వినియోగం ఉంటుందని గుర్తించారు.
వీటితో యువత చెడిపోతున్నారని నివేదించడంతో ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా దందా ఆగడంలేదు. గుట్టుగా హుక్కా కేంద్రాలను కొనసాగిస్తున్నారు. అపార్టుమెంట్లు, కాలనీల్లోని ఇళ్లల్లో నిర్వహిస్తున్నారు. తెలిసిన వ్యక్తులను మాత్రమే అనుమతిస్తూ దందా చేస్తున్నారు. ఏ మాత్రం అనుమానమొచ్చినా వెంటనే అడ్డా మార్చేస్తున్నారు.
హుక్కా కేంద్రాల వెనుక వసూళ్ల దందా : హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా హుక్కా కేంద్రాలు నడపడానికి నిఘా వైఫల్యం కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. పదుల సంఖ్యలో యువకులు తరచూ హుక్కా సెంటర్లకు వెళ్తున్నా గుర్తించడం లేదని వసూళ్లకు పాల్పడుతూ కొంత మంది సిబ్బంది చూసీచూడనట్లు వదిలేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొందరు హోటళ్ల పైభాగంలో రహస్యంగా రూములను ఏర్పాటు చేసి మైనర్లను ఆకర్షించుకుంటున్నారు. విదేశీ సిగరెట్లు అమ్ముతున్నారు. బహదూర్‌పురలోని ఓ కేఫ్‌లో పోలీసులు సోదాలు నిర్వహించగా.. హుక్కా కేంద్రం గుట్టు బయటపడింది. వనస్థలిపురంలో ఓ కేఫ్ నిర్వాహుడు హుక్కా కేంద్రం నిర్వహిస్తూ మూడుసార్లు పోలీసులకు దొరికాడు.
రాష్ట్రంలో హుక్కా కేంద్రాలపై నిషేధం - బిల్లుకు అసెంబ్లీకి ఏకగ్రీవ ఆమోదం
మత్తు పదార్థాల కట్టడిపై సర్కార్ ఫోకస్ - రాష్ట్రంలో 'హుక్కా'ను నిషేధిస్తూ నిర్ణయం