Police Picket In Jammalamadugu: వైయస్సార్ కడప జిల్లాలో సమస్యాత్మకమైన నియోజకవర్గమైన జమ్మలమడుగులో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ యశ్వంత్ తెలిపారు. రేపు జమ్మలమడుగు ప్రాంతంలో కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. వ్యాపారస్తులు దుకాణాలు తెరవకూడదని ఆదేశించారు.
సార్వత్రిక ఎన్నికల లెక్కింపు సందర్భంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. ప్రధాన ప్రాంతాల్లో పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి డేగ కన్నుతో పరిశీలిస్తున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో మొబైల్ టీమ్లతో పర్యవేక్షణ చేపట్టారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు నిఘా కట్టుదిట్టం చేశారు. జమ్మలమడుగు పాత బస్టాండ్, కోవెలకుంట్ల బైపాస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్సీపీ కార్యాలయాలు, గూడెంచెరువు క్రాస్, టోలేట్, దేవగుడి, గొరిగనూరు గ్రామాల్లో పికెట్ ఏర్పాటు చేశారు. ఎర్రగుంట్ల పట్టణంతోపాటు నిడిజివ్వి, పెద్దనపాడు, పోట్లదుర్తి, చిలంకూరు, సిర్రా జుపల్లె, కోడూరు, మాలెపాడు తదితర గ్రామాల్లో నిఘా ఉంచారు. ముద్దనూరు, కొండాపురం మండలాల్లోని అన్ని గ్రామాలు మొబైల్ బృందాల పర్యవేక్షణలో ఉన్నాయి. మైలవరం మండలం చిన్నకొమ్మెర్ల, పెద్దముడియం మండలం కొండ సుంకేసుల గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.
ఇబ్బందులు సృష్టిస్తారని అనుమానిస్తున్న 70 మంది వరకూ ముందు జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నాం. అల్లర్లు సృష్టిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే గుర్తించిన కొందరిని హౌస్ అరెస్ట్ చేయనున్నాం. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తాం. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకూ పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం. -యశ్వంత్, డీఎస్పీ
పోలింగ్ రోజు అల్లర్ల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు మే 13న జరిగిన పోలింగ్ సందర్భంగా జమ్మలమడుగులో వైఎస్సార్సీపీ, కూటమి వర్గీయుల మధ్య ఘర్షణలు జరిగాయి. రెండు వర్గాల మధ్య గొడవలు, దాడులు జరుగుతున్న నేపథ్యంలో జమ్మలమడుగులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ, తెలుగుదేశం, బీజేపీ కార్యాలయాల వద్ద కూడా భారీగా బలగాలను మోహరించారు. జమ్మలమడుగు మండలం దేవగుడిలో ఆదినారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డి నివాసాలతో పాటు యర్రగుంట్ల మండలం నిడిజివ్విలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. మూడు పార్టీల ముఖ్య నాయకులను గృహ నిర్బంధం చేశారు. జమ్మలమడుగుకు సంబంధించి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా గ్రూపుల్లో ఎవరినైనా కించపరిచేలా పోస్టులు పెట్టినా, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. దీనికి గ్రూప్ అడ్మిన్లను బాధ్యుల్ని చేస్తామని స్పష్టం చేశారు.