Nandyala Girl Rape Case Updates : నంద్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన బాలిక సామూహిక అత్యాచారం, హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల ఏడో తేదీన పగిడ్యాల మండలంలోని ఓ గ్రామంలో 9 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. ఇద్దరు పదో తరగతి పిల్లలు, ఒక ఆరో తరగతి అబ్బాయి ఆడుకుంటున్న బాలికకు మాయ మాటలు చెప్పారు. చాక్లెట్ ఇచ్చి బయటకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబుతుందనే భయంతో బాలిక గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత ఏం చేయాలో తోచక మృతదేహాన్ని (Nandyala Girl Missing Case Mystery) కేసీ కెనాల్ వద్ద ముళ్ల పొదల్లో దాచారు.
మైనర్లకు తల్లిదండ్రుల సాయం : బాలికను హత్య చేసిన విషయాన్ని ముగ్గురు మైనర్లు ఇంటికెళ్లి తల్లిదండ్రులకు చెప్పారు. నిర్ఘాంతపోయిన తల్లిదండ్రులు ఆ సమయంలో పిల్లల్ని కాపాడాలని నిర్ణయించుకున్నారు. హత్యను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారు. అదే రోజు రాత్రి శవాన్ని అక్కడి నుంచి వనములపాడు మీదుగా కృష్ణా నదిలో పుట్టిలో తీసుకెళ్లారు. నిజాన్ని ఎలాగైనా సమాధి చేయాలనుకుని మృతదేహాన్ని తాడుతో రాయికి కట్టి నదిలో పడేసి గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి వెళ్లారు. నిందితుల్లో ఓ బాలుడి తండ్రి, పెదనాన్న అసలు విషయం చెప్పడంతో పోలీసలు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. నిందితులైన మైనర్లను జువెనైల్ హోంకు పంపారు. ఇంటర్నెట్ చూసి పిల్లలు పెడదోవ పట్టారని పోలీసులు తెలిపారు.
బాలిక మృతదేహం లభ్యమయ్యే వరకు గాలింపు : బాలిక మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈత గాళ్లతో కృష్ణా నదిలో జల్లెడపడుతన్నా ప్రయోజనం లేకపోతోంది. 6 స్పెషల్ పార్టీ బృందాలు, డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాలు, టెక్నికల్ టీమ్‌లను రంగంలోకి దించారు. బాలిక మృతదేహం లభ్యమయ్యే వరకు గాలింపు కొనసాగుతుందన్న పోలీసులు పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించి, విద్యార్థుల్లో చైతన్యం పెంపొందిస్తామని పేర్కొన్నారు.
పోక్సో చట్టం కింద కేసు నమోదు : నిందిత మైనర్లు సెల్ ఫోన్లో అశ్లీల వీడియోలు చూసేవారని వాటి ప్రభావంతో బాలికపై దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలిందని నంద్యాల మాజీ ఎస్పీ రఘువీరారెడ్డి తెలిపారు. వీరిపై మొదట సెక్షన్ 69/21 కింద బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేశామని తాజాగా క్లాజ్ 70/2, క్లాజ్ 103/1, 238 ఏ సహా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు.
ఇద్దరు పోలీసు అధికారులు సస్పెండ్ : బాలిక అదృశ్యం ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇద్దరు పోలీసు అధికారులపై కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు సస్పెన్షన్ వేటు వేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణ ఉల్లంఘించారని వారిపై చర్యలు తీసుకున్నారు. నందికొట్కూరు రూరల్ సీఐ విజయ్‌భాస్కర్, ముచ్చుమర్రి ఎస్సై జయశేఖర్‌ను సస్పెండ్ చేశారు. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఐజీ విజయరావు హెచ్చరించారు.