Lookout Notices for Perni Jayasudha : గోదాములో రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో నమోదైన కేసులో మాజీమంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ జిల్లా కోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఈ నెల 19వ తేదికి వాయిదా పడింది. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాములో పౌరసరఫరాల శాఖకు చెందిన 185 టన్నుల చౌక బియ్యం మాయమైన వ్యవహారంలో ఈ నెల 10న గోదాము యజమాని పేర్ని జయసుధ, మేనేజర్ మానస్ తేజపై బందరు తాలూకా పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నాని మచిలీపట్నంలో ప్రత్యక్షం అవడం చర్చంశనీయంగా మారింది.
తనపై నమోదైన కేసులపై ఈనెల 13న జయసుధ జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, దీనిని జిల్లా జడ్జి అరుణసారిక 9వ అదనపు కోర్టుకు బదిలీ చేశారు. సోమవారం కేసుకు సంబంధించి వాదనలు జరగాల్సి ఉండగా పోలీసుల నుంచి సీడీ ఫైల్ అందకపోవడంతో తొమ్మిదో అదనపు కోర్టు న్యాయాధికారి ఎస్.సుజాత గురువారానికి వాయిదా వేశారు. అయితే ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున ప్రధాన ప్రత్యేక పీపీని నియమించాల్సి ఉందని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడగా, ఇప్పటికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన ఏపీపీనే కొనసాగించడం పట్ల న్యాయవాద వర్గాల నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అజ్ఞాతంలో పేర్ని నాని కుటుంబం! - ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు
పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాములో రేషన్ బియ్యం మాయమైన ఘటనకు సంబంధించి గోదాము యజమాని పేర్ని జయసుధ, మేనేజర్ మాసన్ తేజపై క్రిమినల్ కేసుల నమోదైనప్పటి నుంచి పేర్ని కుటుంబం కనిపించడం లేదు. బియ్యం మాయమైన కేసులో ప్రధాన నిందితురాలు జయసుధ విదేశాలకు వెళ్లిపోకుండా లుక్ ఔట్ నోటీసులు జారీ చేసినట్లు సోమవారం ఎస్పీ గంగాధరరావు తెలిపారు.
పేర్ని కుటుంబానికి చెందిన గోదాములను పౌరసరఫరాల శాఖ ఒప్పందం ప్రకారం బఫర్ గోదాములుగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. పేర్ని గోదాములో ప్రభుత్వానికి చెందిన 7719 బస్తాల బియ్యంలో 3708 బస్తాలు మాయమైన కేసు నేపథ్యంలో గోదాముల్లోని మిగిలిన బియ్యాన్ని పౌరసరఫరాల శాఖాధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సాయంత్రం గోదాముల తాళాలు పగల గొట్టి అందులోని ప్రభుత్వ బియ్యాన్ని అధికారుల స్వాధీనం చేసుకున్నారు. గదాముల వద్ద వే బ్రిడ్జ్ సరిగా పని చేయట్లేదని తూకంలో వ్యత్యాసాలు వస్తున్నాయని వేరే వేబ్రిడ్జ్ వద్ద తూకాలు పరిశీలించి మచిలీపట్నంలోని మార్కెట్ యార్డ్‌కు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గోదాములను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. మరో వైపు రెట్టింపు రుసుములో ఇప్పటికే పేర్ని తరఫున కోటి రూపాయల చెక్కును జేసీ కార్యాలయంలో ఓ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెల్లించారని అధికారులు చెప్పారు. దీనికి సంబంధించి మిగిలిన రుసుము 70లక్షలను సోమవారం చెల్లించినట్లు తెలుస్తోంది.
'పేర్ని నాని రెట్టింపు జరిమానా కట్టాలి- క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాలి'
పేర్ని కుటుంబానికి చెందిన గోదాముల్లో బియ్యం మాయమైన సంఘటన నేపధ్యంలో సోమవారం పేర్ని నివాస గృహంలో ప్రత్యక్షమయ్యారు. మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే కైలే అనీల్‌కుమార్ తదితరులు మంతనాలు జరిపారు. బియ్యం మాయమైన సంఘటనపై కేసు నమోదైనప్పటి నుంచి స్థానికంగా ఏ విధమైన కార్యక్రమాల్లో పేర్ని పాల్గొనలేదు. దీంతో వారం రోజులుగా పేర్ని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారన్న ప్రచారం సాగింది.
గోదాములో పీడీఎస్ రైస్ మాయం! - మాజీ మంత్రి పేర్నినాని భార్యపై కేసు